KTR: రేవంత్ రెడ్డి నన్ను తిట్టినప్పుడు కేసీఆర్ ఫోన్ చేసి ఆ మాట చెప్పారు: కేటీఆర్

KTR Reveals KCRs Advice After Revanth Reddys Criticism
  • రేవంత్ రెడ్డి ఒత్తిడిలో ఉన్నారని, ఓడిపోతున్నాడని తెలిసి నిరాశలో ఉన్నాడని కేసీఆర్ చెప్పారన్న కేటీఆర్
  • సంయమనంతో మాట్లాడాలని కేసీఆర్ తనకు సూచించారన్న కేటీఆర్
  • రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూనే, జూబ్లీహిల్స్ ఓటమి తర్వాతైనా మంచి పాలన అందించాలని చమత్కారం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను దూషించినప్పుడు, తమ పార్టీ అధినేత కేసీఆర్ ఫోన్ చేసి, నువ్వు టెంప్ట్ కావొద్దని సూచించారు, దీంతో తాను ఏమీ అనలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. టీవీ-9 ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఇటీవల జరిగిన ఒక సభలో రేవంత్ రెడ్డి తనను తీవ్రంగా దూషించారని, అది చూసిన కేసీఆర్ వెంటనే ఫోన్ చేసి మాట్లాడారని కేటీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో నిరాశలో ఉన్నందువల్ల అలా మాట్లాడుతున్నారని కేసీఆర్ తనకు చెప్పారని ఆయన అన్నారు.

అందుకే, తాను కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించవద్దని కేసీఆర్ సూచించారని కేటీఆర్ తెలిపారు. సంయమనంతో వ్యవహరించాలని కేసీఆర్ సలహా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తనను దూషించినందుకు మరుసటి రోజు తాను కూడా ఘాటుగా మాట్లాడాలనుకున్నానని, కానీ కేసీఆర్ సూచనతో సంయమనం పాటించానని కేటీఆర్ అన్నారు.

ఇలాంటి విషయాల్లో అన్ని పార్టీల అధ్యక్షులు తమ పార్టీ నేతలను నియంత్రించాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తనను కేసీఆర్ నియంత్రించినట్లుగానే, కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బీజేపీలో రామచంద్ర రావు తమ పార్టీ నేతలను నియంత్రించాలని ఆయన అన్నారు. ఇలాంటి ధోరణుల వల్ల ప్రజలు రాజకీయ నాయకులను అసహ్యించుకునే పరిస్థితి వస్తుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంచి సంప్రదాయానికి తమ పార్టీ తరఫున పునాది వేస్తామని ఆయన అన్నారు. తనను విమర్శిస్తే సహిస్తానని, కానీ కేసీఆర్‌ను విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాతైనా తెలంగాణలో మంచి పాలన అందించాలని ఆశిస్తున్నాను. ఆయన నిండు నూరేళ్ల ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR
Revanth Reddy
KCR
Telangana Politics
BRS Party
Congress Party
Jubilee Hills Election

More Telugu News