Parappana Jail: బెంగళూరు పరప్పన జైలులో ఫోన్లు మాట్లాడుతూ, టీవీలు చూస్తున్న ఖైదీలు!

Parappana Jail Prisoners Using Phones Watching TV
  • సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన వీడియో క్లిప్స్
  • అత్యాచారం, హత్య కేసుల నిందితుడు కూడా మొబైల్ వినియోగిస్తున్నట్లు వీడియోలు
  • జైలులో వెలుగు చూసిన భద్రతా లోపాలు
కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఖైదీలు నిబంధనలకు విరుద్ధంగా సరదాగా గడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖైదీలు మొబైల్ ఫోన్లు వాడుతున్నారని, టీవీలు చూస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. శిక్షలు పడినప్పటికీ ఖైదీలు కొందరు నిబంధనలకు విరుద్ధంగా గడుపుతున్నట్లు సమాచారం.

1996-2022 మధ్య 20 మంది మహిళలపై అత్యాచారం చేసి, వారిలో 18 మందిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన ఉమేశ్ కు తొలుత కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, సుప్రీంకోర్టు దానిని 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా మార్పు చేసింది. ఇదే జైలులో ఉన్న ఉమేశ్ మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

జైలు లోపల రెండు ఆండ్రాయిడ్ ఫోన్లు, ఒక కీప్యాడ్ మొబైల్‌ను ఉమేశ్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అతడిని ఉంచిన జైలు సెల్‌లో టీవీ కూడా ఉన్నట్లు సమాచారం. నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన తరుణ్ రాజు కూడా జైల్లో మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, అతడిని ఉంచిన సెల్‌లో వంట కూడా చేసుకుంటున్నాడని తెలుస్తోంది. పలువురు ఇతర ఖైదీలు కూడా మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

వీటికి సంబంధించిన వీడియో క్లిప్స్ వైరల్ కావడంతో జైలులో భద్రతా లోపాలు వెలుగుచూశాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. దీనిపై దర్యాప్తునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Parappana Jail
Bengaluru
Karnataka
Umesh
Tarun Raju
Ranya Rao
Jailbreak
Prison

More Telugu News