Pratap Sarnaik: మహారాష్ట్రలో భారీ కుంభకోణం.. రూ. 200 కోట్ల విలువైన భూమిని రూ. 3 కోట్లకే దక్కించుకున్న మంత్రి!

Pratap Sarnaik Accused in Maharashtra Land Scam Worth 200 Crore
  • మంత్రి ప్రతాప్ సర్‌నాయక్‌పై ప్రతిపక్షాల ఆరోపణలు
  • భయాందర్‌లో నాలుగు ఎకరాల భూమిని తక్కువధరకే కొనుగోలు చేశారని కాంగ్రెస్ నాయకుడి ఆరోపణ
  • ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్న రెవెన్యూ మంత్రి
మహారాష్ట్రలో రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ రూ. 200 కోట్ల విలువైన భూమిని రూ. 3 కోట్లకే దక్కించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ భూకుంభకోణం కేసు ఇప్పటికే రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుండగా, తాజాగా రాష్ట్ర మంత్రిపై వచ్చిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయ్ వడెట్టివార్ విలేకరులతో మాట్లాడుతూ, ప్రతాప్ సర్‌నాయక్ మీరా భయాందర్‌లో దాదాపు రూ. 200 కోట్ల విలువైన నాలుగు ఎకరాల భూమిని రూ. 3 కోట్లకే కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆ స్థలలోనే ఆయన ఓ విద్యా సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ ఆరోపణలపై మహారాష్ట్ర రెవెన్యూమంత్రి చంద్రశేఖర్ బవాంకులే స్పందించారు. ఈ విషయం గురించి తాను కూడా విన్నానని, కానీ దీనిపై ఎవరి దగ్గరి నుంచి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ప్రతిపక్షాలు తమకు ఫిర్యాదు చేయడం మానేసి, మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసేందుకే సమయం కేటాయిస్తున్నాయని విమర్శించారు. ఈ భూమికి సంబంధించి ఏదైనా ఫిర్యాదు అందితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా, రూ. 18,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్‌కు చెందిన సంస్థకు రూ. 300 కోట్లకే విక్రయించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై దర్యాప్తునకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంత్రిపై కూడా ఆరోపణలు రావడం గమనార్హం.
Pratap Sarnaik
Maharashtra
land scam
Vijay Wadettiwar
Ajit Pawar
Parth Pawar
Chandrashekhar Bawankule

More Telugu News