Vivek Ramaswamy: వివేక్ రామస్వామి ప్రత్యేకమైన వ్యక్తి... ఎన్నికైతే గ్రేట్ గవర్నర్ అవుతారు: ట్రంప్ ప్రశంసలు

Trump Praises Vivek Ramaswamy Calls Him Special for Ohio Governor
  • వచ్చే ఏడాది జరగనున్న ఒహాయో గవర్నర్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన వివేక్
  • మద్దతుగా సామాజిక మాధ్యమ వేదికగా పోస్టు పెట్టిన ట్రంప్
  • వివేక్ యువకుడు, తెలివైన వాడు, మంచి వ్యక్తి అన్న ట్రంప్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఆయనను 'ప్రత్యేకమైన వ్యక్తి' (సమ్‌థింగ్ స్పెషల్) అంటూ ట్రంప్ ఒక పోస్టు పెట్టారు. వివేక్ రామస్వామి ఒహాయో గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఈ ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా ట్రంప్ ఈ పోస్టు పెట్టారు. ఒహాయో రాష్ట్రాన్ని గ్రేట్ స్టేట్‌గా అభివర్ణిస్తూ, వివేక్ రామస్వామి ఎన్నికైతే గొప్ప గవర్నర్ అవుతారని ట్రంప్ పేర్కొన్నారు.

"ది గ్రేట్ ఒహాయో రాష్ట్రానికి వివేక్ రామస్వామి పోటీ చేస్తున్నారు. నాకు ఆ ప్రాంతం అంటే ఎంతో ఇష్టం. 2016, 2020, 2024 ఎన్నికల్లో నేను భారీ విజయం సాధించాను. వివేక్ నాకు బాగా తెలుసు. అధ్యక్ష ఎన్నికల్లో నాతోనే పోటీకి వచ్చాడు. అతడు ప్రత్యేకమైన వ్యక్తి. వివేక్ యువకుడు, తెలివైనవాడు, చాలా మంచి వ్యక్తి. అతనికి మన దేశం అంటే ఎంతో ఇష్టం" అని ట్రంప్ తన ట్రూత్ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు.

ఒహాయో తదుపరి గవర్నర్‌గా ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధికి వివేక్ కృషి చేస్తారని ఆయన అన్నారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, వలస నేరాలను అరికట్టడం, శాంతిభద్రతలను కాపాడటం, ఎన్నికల సమగ్రతను ముందుకు తీసుకువెళ్లడం కోసం ఆయన అవిశ్రాంతంగా పోరాడుతారని ట్రంప్ పేర్కొన్నారు.
Vivek Ramaswamy
Donald Trump
Ohio Governor Election
Ohio
US Presidential Election
Indian American

More Telugu News