Philanthropy List 2024-25: భారత కుబేరుల ఉదారత.. రూ. 10,380 కోట్లు విరాళం.. దాతృత్వంలో మరోసారి శివ్ నాడార్ టాప్

Indian Billionaires Donate Rs 10380 Crore Shiv Nadar Tops List
  • దాతృత్వంలో మరోసారి శివ్ నాడార్ అగ్రస్థానం
  • రూ. 2708 కోట్ల విరాళంతో జాబితాలో మొదటి స్థానం
  • రెండో స్థానంలో ముకేశ్ అంబానీ.. మూడో స్థానంలో బజాజ్ ఫ్యామిలీ
  • ఈ ఏడాది రూ. 10,380 కోట్లు విరాళమిచ్చిన 191 మంది దాతలు
  • విరాళాల్లో సింహభాగం విద్యా రంగానికే కేటాయింపు
  • మహిళల్లో రోహిణి నీలేకని.. యువతలో నిఖిల్ కామత్ టాప్
భారతదేశంలో అత్యంత ఉదారంగా విరాళాలు ఇచ్చే వారి జాబితా విడుదలైంది. ఎడెల్‌గివ్, హురూన్ ఇండియా తాజాగా విడుదల చేసిన ‘ఫిలాంత్రపీ లిస్ట్ 2024-25’లో హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, ఆయన కుటుంబం మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వారు ఏకంగా రూ. 2,708 కోట్ల భారీ విరాళం అందించారు. ఇది సగటున రోజుకు రూ. 7.40 కోట్లతో సమానం. గత ఐదేళ్లలో శివ్ నాడార్ ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం ఇది నాలుగోసారి.

శివ్ నాడార్ త‌ర్వాత‌ రెండో స్థానంలో ముకేశ్ అంబానీ
ఈ జాబితా ప్రకారం, 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 మధ్య దేశంలోని 191 మంది అత్యంత ధనవంతులు కలిసి మొత్తం రూ. 10,380 కోట్లను విరాళంగా అందించారు. ఇది గత మూడేళ్లతో పోలిస్తే 85 శాతం అధికం కావడం గమనార్హం. శివ్ నాడార్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రూ. 626 కోట్లతో రెండో స్థానంలో, బజాజ్ ఫ్యామిలీ రూ. 446 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. అదానీ కుటుంబం రూ. 386 కోట్లు విరాళంగా ఇచ్చింది. కనీసం రూ. 5 కోట్లకు పైగా విరాళం అందించిన వారిని ఈ జాబితాలో చేర్చారు.

విద్యా రంగానికే పెద్దపీట
ఈ విరాళాల్లో సింహభాగం విద్యా రంగానికి దక్కింది. శివ్ నాడార్, ముకేశ్ అంబానీ, అదానీ కుటుంబం వంటి వారు తమ విరాళాలను అధికంగా విద్య కోసమే కేటాయించారు. మొత్తం విరాళాల్లో ఒక్క విద్యా రంగానికే రూ. 2,392 కోట్లు అందాయి. ఆ తర్వాతి స్థానంలో ఆరోగ్య సంరక్షణ (హెల్త్ కేర్) ఉంది. ఈ రంగానికి రూ. 971 కోట్లు రాగా, హిందుజా ఫ్యామిలీ అధికంగా దీనికే కేటాయించింది. పర్యావరణ పరిరక్షణ కోసం అంబానీ కుటుంబం రూ. 171 కోట్లు వెచ్చించింది.

మహిళల్లో రోహిణి నీలేకని అగ్ర‌స్థానం
ఈ జాబితాలో పలు ఆసక్తికర అంశాలు కూడా ఉన్నాయి. మొత్తం 191 మంది దాతలలో 24 మంది మహిళలు ఉండగా, వీరిలో రోహిణి నీలేకని రూ. 204 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. మరోవైపు జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (39) వరుసగా నాలుగోసారి అత్యంత పిన్నవయస్కుడైన దాతగా నిలిచారు. మొత్తంగా చూస్తే భారత కుబేరుల్లో దాతృత్వ గుణం పెరుగుతోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
Philanthropy List 2024-25
Shiv Nadar
HCL
Mukesh Ambani
Indian billionaires
donations
education sector
Rohini Nilekani
Nikhil Kamath
Adani Group

More Telugu News