India Vs Pakistan: ఒలింపిక్స్‌లో దాయాదుల పోరు అనుమానమే.. ఐసీసీ కొత్త నిబంధనతో పాక్‌కు కష్టాలు

Pakistan Might Not Qualify For LA 2028 Olympics Cricket Due To This Rule
  • 2028 ఒలింపిక్స్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అనుమానమే
  • మారిన అర్హత నిబంధనలే ఇందుకు కారణం
  • ర్యాంకింగ్స్ కాకుండా రీజియన్ల వారీగా జట్ల ఎంపిక
  • ఆసియా నుంచి భారత్‌కు బెర్త్ దాదాపు ఖాయం
  • పాకిస్థాన్ అర్హత సాధించడం కష్టతరం
  • పురుషుల, మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు.. ఐసీసీ ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంటారు. అయితే, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ఈ దాయాదుల పోరును చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశ ఎదురయ్యేలా ఉంది. ఐసీసీ ప్రకటించిన నూతన అర్హత నిబంధనలే ఇందుకు కారణం.

దుబాయ్‌లో శుక్రవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీని ప్రకారం ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్లను ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా కాకుండా ఖండాలు లేదా రీజియన్ల వారీగా ఎంపిక చేయనున్నారు. ప్రతి రీజియన్‌లోని అగ్రశ్రేణి జట్టుకు ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. ఆరో జట్టును గ్లోబల్ క్వాలిఫయర్ ద్వారా నిర్ణయిస్తారు. ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్ 1 స్థానంలో ఉండగా, ఆసియా రీజియన్‌లో కూడా అగ్రస్థానంలో ఉంది.

ఈ విధానం ప్రకారం ఆసియా నుంచి అగ్రశ్రేణి జట్టుగా ఉన్న భారత్ నేరుగా అర్హత సాధించే అవకాశం ఉంది. అలాగే ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, యూరప్ నుంచి ఇంగ్లండ్, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా జట్లు ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆసియా నుంచి ఒకే జట్టుకు అవకాశం ఉండటంతో పాకిస్థాన్‌కు మార్గం దాదాపు మూసుకుపోయినట్లే. ఒకవేళ ఆసియా నుంచి రెండు జట్లకు అవకాశం కల్పిస్తే లేదా గ్లోబల్ క్వాలిఫయర్స్‌లో గెలిస్తే తప్ప పాకిస్థాన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం కష్టమే.

లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు పాల్గొంటాయని, మొత్తం 28 మ్యాచ్‌లు జరుగుతాయని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆతిథ్య దేశం అమెరికాకు నేరుగా ప్రవేశం కల్పిస్తారా? లేక వెస్టిండీస్‌కు అవకాశం ఇస్తారా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రీడలు 2028 జులై 12న ప్రారంభం కానున్నాయి. గ్లోబల్ క్వాలిఫయర్, ఆతిథ్య దేశం కోటాపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఐసీసీ తెలిపింది.
India Vs Pakistan
ICC
India
Pakistan
Olympics
T20 rankings
Los Angeles Olympics 2028
Cricket
Asia Cup

More Telugu News