Rukmini Vasanth: నా పేరుతో మోసాలు, జాగ్రత్త.. హీరోయిన్ రుక్మిణి వసంత్ హెచ్చరిక!

Rukmini Vasanth Warns of Fraudulent Activity Using Her Name
  • తన పేరుతో ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడని చెప్పిన రుక్మిణి 
  • ఓ ఫేక్ ఫోన్ నంబర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి, అప్రమత్తంగా ఉండాలని సూచన
  • ఇది సైబర్‌క్రైమ్ కిందకు వస్తుందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి
  • మరోవైపు ప్రశాంత్ నీల్‌ను 'జీనియస్' అని అభివర్ణించిన నటి
  • ఎన్టీఆర్ సినిమాలో చాన్స్ వార్తలపై ఆసక్తికరంగా స్పందన
పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'కాంతార: చాప్టర్ 1' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి రుక్మిణి వసంత్, తన పేరుతో జరుగుతున్న ఓ మోసంపై అభిమానులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి తన పేరు వాడుకుంటూ పలువురిని సంప్రదిస్తున్నాడని, అతడితో జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.

ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. "అత్యంత ముఖ్యమైన హెచ్చరిక" అనే శీర్షికతో ఒక పోస్ట్ పెడుతూ, "9445893273 అనే నంబర్‌ను వాడుతున్న ఒక వ్యక్తి, నేనేనని చెప్పుకుంటూ తప్పుడు ఉద్దేశాలతో పలువురిని సంప్రదిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఆ నంబర్‌కు, నాకు ఎలాంటి సంబంధం లేదు. దాని నుంచి వచ్చే కాల్స్ లేదా మెసేజ్‌లు పూర్తిగా నకిలీవని స్పష్టం చేస్తున్నాను. దయచేసి ఎవరూ స్పందించవద్దు" అని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇలాంటి మోసపూరిత చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రుక్మిణి హెచ్చరించారు. "ఇలాంటి మోసాలు సైబర్‌క్రైమ్ పరిధిలోకి వస్తాయి. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఏదైనా సమాచారం కోసం నేరుగా నన్ను లేదా నా టీమ్‌ను సంప్రదించండి. అప్రమత్తంగా, ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండండి" అని ఆమె పేర్కొన్నారు.

ఎన్టీఆర్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు

మరోవైపు రుక్మిణి వసంత్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం (#NTRNeel)లో నటిస్తున్నారనే ఊహాగానాలకు తన సమాధానాలతో మరింత బలం చేకూర్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన ఆమె, దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను ఒక్క మాటలో వర్ణించమని కోరగా, "జీనియస్" అని సమాధానమిచ్చారు.

అదే సంభాషణలో, "మీరు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో నటిస్తున్నారా?" అని ఒక అభిమాని నేరుగా ప్రశ్నించగా, ఆమె తెలివైన సమాధానమిచ్చారు. "అయ్యో, ఈ సీజన్‌లో అందరికీ తెలిసిన రహస్యం ఇదే కదా? నేను చెప్పాల్సిన దానికంటే మీకే ఎక్కువ తెలుసనుకుంటా!" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. రుక్మిణి అధికారికంగా ధ్రువీకరించకపోయినా, ఆమె మాటలతో ఈ ప్రాజెక్ట్‌లో తన పాత్ర దాదాపు ఖాయమని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.
Rukmini Vasanth
Kantara Chapter 1
fraud
cyber crime
Jr NTR
Prashanth Neel
NTR Neel
Tollywood
movie rumors
actress

More Telugu News