NTR District: ఒకే మొక్కకు మూడు రకాల కూరగాయలు.. ఏమిటీ వింత?

Chilli Plant Bears Brinjal And Tomatoes In NTR District Andhra Pradesh
  • ఎన్టీఆర్ జిల్లాలో ఓ రైతు పొలంలో వింత
  • మిరప చెట్టుకు టమాటాలు, వంకాయల కాపు
  • జగ్గయ్యపేట రైతు రమేశ్‌ తోటలో అరుదైన దృశ్యం
  • వింత మొక్కను చూసేందుకు తరలివస్తున్న జనం
  • జన్యు మార్పులే కారణమంటున్న ఉద్యానశాఖ అధికారి
సాధారణంగా ఒక చెట్టుకు ఒకే రకమైన కాయలు కాయడం ప్రకృతి ధర్మం. కానీ, దానికి విరుద్ధంగా ఒకే మొక్కకు మూడు రకాల కాయలు కాస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి అరుదైన, ఆశ్చర్యకరమైన ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ రైతు సాగుచేసిన మిరప చెట్లకు మిరపకాయలతో పాటు వంకాయలు, టమాటాలు కూడా కాయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడుకు చెందిన రైతు ముత్యాల రజిత రమేశ్ తన పొలంలో మిరప తోటను సాగు చేస్తున్నారు. అయితే, తన తోటలోని రెండు మిరప మొక్కలకు మిరపకాయలతో పాటు వంకాయలు, టమాటాలు కూడా కాయడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఈ వింత విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో, ఈ అరుదైన మొక్కలను చూసేందుకు జనం ఆయన పొలానికి తరలివస్తున్నారు.

కొంతమంది దీన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. ఈ వింత మొక్కను చూసిన వారు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కొందరు దీన్ని దైవ మహత్యంగా భావిస్తుంటే, మరికొందరు దీని వెనుక ఏదో శాస్త్రీయ కారణం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఈ వింత మొక్కపై జగ్గయ్యపేట డివిజన్‌ ఉద్యానశాఖాధికారి బాలాజీ స్పందించారు. ఒకే మొక్కకు మూడు రకాల కాయలు కాయడం వెనుక జన్యుపరమైన మార్పులు కారణమై ఉండొచ్చని ఆయన వివరించారు. "మిరప, టమాటా, వంగ.. ఈ మూడు 'సొలనేసి' అనే ఒకే వృక్ష కుటుంబానికి చెందినవి. అందువల్ల కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి మార్పులు సంభవించే అవకాశం ఉంది" అని ఆయన తెలిపారు. కారణం ఏదైనప్పటికీ, ఈ వింత మొక్క మాత్రం స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. వ్యవసాయ అధికారులు కూడా ఈ మొక్కను పరిశీలిస్తున్నారు.
NTR District
Mutyala Rajitha Ramesh
three vegetables on one plant
mirchi tomato brinjal plant
genetic modification
vegetable farming Andhra Pradesh
Takkelapadu village
horticulture department
Solanaceae family
viral news

More Telugu News