Ghana: ఆఫ్రికాలో చిక్కుకున్న తెలుగు యువకుడు.. కాపాడాలంటూ కన్నీటి పర్యంతం

Telugu Youth Chandra Kumar Reddy Seeks Help After Being Stuck in Africa
  • ఉపాధి కోసం ఆఫ్రికా వెళ్లిన సత్యసాయి జిల్లా యువకుడికి కష్టాలు
  • ఘనాలో కంపెనీ యాజమాన్యం వేధిస్తోందంటూ వీడియో విడుదల
  • డబ్బు దొంగతనం జరగడంతో తనదే బాధ్యత అంటున్నారని ఆవేదన
  • అనారోగ్యంతో బాధపడుతున్నా స్వదేశానికి పంపడం లేదని ఆరోపణ
  • నన్ను కాపాడకపోతే ఆత్మహత్యే శరణ్యమని ప్రభుత్వానికి విజ్ఞప్తి
బతుకుదెరువు కోసం ఖండాంతరాలు దాటి వెళ్లిన శ్రీసత్యసాయి జిల్లా యువకుడు ఆఫ్రికాలో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కంపెనీ యాజమాన్యం తనను తీవ్రంగా వేధిస్తోందని, స్వదేశానికి పంపకుండా నరకం చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనను ఎలాగైనా కాపాడి స్వ‌దేశానికి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.

వివరాల్లోకి వెళితే.. శ్రీసత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మండలం వనుకువారిపల్లికి చెందిన చంద్రకుమార్‌ రెడ్డి ఏడాది క్రితం ఉపాధి కోసం ఆఫ్రికాలోని ఘనా దేశానికి వెళ్లాడు. అక్కడ జీఎంఆర్‌ ఇండస్ట్రీ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అయితే, ఇటీవల మార్కెట్‌కు వెళ్లినప్పుడు కొందరు దొంగలు తనపై దాడి చేసి కంపెనీకి చెందిన డబ్బును దోచుకున్నారని వీడియోలో తెలిపాడు.

ఈ ఘటనకు కంపెనీ యజమానులైన గణేశ్‌ ముత్యాలరెడ్డి, కౌశిక్‌ రెడ్డి తననే బాధ్యుడిని చేశారని చంద్రకుమార్‌ రెడ్డి ఆరోపించాడు. తన నుంచి బలవంతంగా రూ.5 లక్షలు రికవరీ చేశారని వాపోయాడు. ఈ ఘటన తర్వాత తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, సుమారు 15 కిలోల బరువు తగ్గానని చెప్పాడు. తనను స్వదేశానికి పంపమని ఎంత వేడుకున్నా యాజమాన్యం కనికరించడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

"నా ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఇక్కడ బతకడం కష్టంగా ఉంది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయి. నన్ను ఇండియాకు పంపకపోతే ఆత్మహత్యే నాకు శరణ్యం. నా చావుకు కంపెనీ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుంది" అని చంద్రకుమార్‌ రెడ్డి వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చంద్రకుమార్‌ రెడ్డిని సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని కోరుతున్నారు.
Ghana
Chandra Kumar Reddy
Africa
GMR Industry
Telugu youth
stranded
financial issues
exploitation
rescue
Sri Sathya Sai district

More Telugu News