Sreecharani: శ్రీచరణి సాధించిన ఘనత భారత మహిళల శక్తికి నిదర్శనం: మంత్రి నారా లోకేశ్

Sreecharani Achievement Reflects Indian Womens Power Says Minister Nara Lokesh
  • సీఎం చంద్రబాబును కలిసిన టీమిండియా క్రికెటర్ శ్రీచరణి
  • అమరావతిలోని నివాసంలో ఘనంగా సత్కరించిన సీఎం, మంత్రి లోకేశ్
  • శ్రీచరణితో పాటు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా భేటీ
  • భారత మహిళల సత్తా చాటావంటూ శ్రీచరణిని అభినందించిన సీఎం
  • శ్రీచరణికి గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
  • ప్రపంచకప్‌లో 14 వికెట్లతో సత్తా చాటిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్
భారత మహిళల క్రికెట్ జట్టు సగర్వంగా నిలిచిన ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ క్రీడాకారిణి శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా హాజరైంది.

అమరావతిలోని తమ నివాసానికి శ్రీచరణి, మిథాలీ రాజ్‌లను ఆహ్వానించి వారిని సత్కరించారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. మహిళల ప్రపంచకప్‌లో భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించడంలో భాగమైన శ్రీచరణిని అభినందించడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ... "శ్రీచరణి సాధించిన ఘనత భారత మహిళల శక్తికి, స్ఫూర్తికి నిజమైన నిదర్శనం. ఆమె భవిష్యత్ తరాల యువ అథ్లెట్లకు గొప్ప ప్రేరణగా నిలుస్తుంది" అని ప్రశంసించారు. ఈ మేరకు ఆయన #APWelcomesShreeCharani అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జోడించారు. 

మహిళల క్రికెట్ ప్రపంచకప్-2025ను గెలిచిన భారత జట్టు సభ్యురాలు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రికెటర్ ఎన్. శ్రీచరణి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి శుక్రవారం అమరావతిలోని సీఎం అధికారిక నివాసానికి వచ్చిన ఆమెను ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా శ్రీచరణి, మిథాలీ రాజ్‌కు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సాదర స్వాగతం పలికారు. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన శ్రీచరణిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ అభినందించారు. శ్రీచరణితో ముఖ్యమంత్రి సెల్ఫీ దిగారు. అనంతరం ‘ఎక్స్’లో స్పందిస్తూ.. "విన్నర్‌గా నిలిపిన స్పిన్నర్‌తో సెల్ఫీ" అని పోస్ట్ చేశారు.

అంతకుముందు, విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీశ్, మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఛైర్మన్ అనిమిని రవి నాయుడు ఆమెకు స్వాగతం పలికారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా, యర్రమల పల్లె అనే చిన్న గ్రామానికి చెందిన శ్రీచరణికి ఇదే తొలి ప్రపంచకప్. ఈ టోర్నీలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా అద్భుతంగా రాణించి 14 వికెట్లు పడగొట్టింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో కీలక సమయంలో వికెట్ తీసి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై కూడా 10 ఓవర్లలో 49 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసింది. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్‌లో పార్ట్‌టైమ్ క్రికెటర్ అయిన తన మామయ్య కిశోర్ కుమార్ రెడ్డి వద్ద శ్రీచరణి శిక్షణ పొందింది.
Sreecharani
Indian Women's Cricket Team
Nara Lokesh
Mithali Raj
Women's World Cup 2025
Andhra Pradesh
Cricket
Sports
Chandrababu Naidu
Left Arm Spinner

More Telugu News