Amaravati ORR: అమరావతి ఓఆర్ఆర్‌లో కీలక ముందడుగు.. మొదలైన భూసేకరణ ప్రక్రియ

Amaravati ORR Land Acquisition Begins Key Step Forward
  • భూసేకరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం
  • తొలిదశలో పల్నాడు జిల్లాకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
  • అభ్యంతరాల స్వీకరణకు 21 రోజుల గడువు
  • గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు అత్యంత కీలకం
  • నెలాఖరు నాటికి అన్ని జిల్లాల్లో గెజిట్ పూర్తి చేసేందుకు యత్నం
రాజధాని అమరావతికి తలమానికంగా నిలవనున్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణంలో అత్యంత కీలకమైన ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలిదశలో పల్నాడు జిల్లాకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ (3ఏ) విడుదలైంది. త్వరలోనే దీనిని పత్రికల్లో ప్రకటించి, ప్రజల అభ్యంతరాలను స్వీకరించనున్నారు.

పల్నాడు జిల్లాలోని రెండు మండలాల పరిధిలో 17.230 కిలోమీటర్ల పొడవున భూమిని సేకరించనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ గెజిట్‌లో స్పష్టం చేసింది. ఓఆర్ఆర్ పరిధిలోకి వచ్చే భూముల సర్వే నంబర్లు, యజమానుల వివరాలను ఇందులో పొందుపరిచారు. ఈ నోటిఫికేషన్‌పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, 21 రోజుల్లోగా భూసేకరణ అధికారికి తెలియజేయాలని సూచించారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ గెజిట్‌ను పత్రికల్లో ప్రచురించి, కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దారు కార్యాలయాల్లోనూ కాపీలను అందుబాటులో ఉంచనున్నారు.

పల్నాడు జిల్లాలో సేకరణ వివరాలు
గెజిట్ ప్రకారం అమరావతి మండలంలోని దిడుగు, నెమలికల్లు గ్రామాల పరిధిలో 565.87 ఎకరాలు, పెదకూరపాడు మండలంలోని ఏడు గ్రామాల పరిధిలో 607.48 ఎకరాలను సేకరించనున్నారు. ఈ రెండు మండలాల్లో కలిపి మొత్తం 990 మంది రైతుల నుంచి భూములను తీసుకోనున్నారు. ఇందులో పట్టా, ప్రభుత్వ, అసైన్డ్, ఈనాం భూములు ఉన్నాయి.

కీలకంగా గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు
అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు అత్యంత కీలకం కానున్నాయి. ఓఆర్ఆర్ ఎక్కువగా ఈ జిల్లాల నుంచే వెళ్లనుంది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 11 మండలాల్లోని 40 గ్రామాల మీదుగా 67.650 కిలోమీటర్ల మేర భూసేకరణ జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకుందని, వారం పది రోజుల్లో గెజిట్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గతంలో సిద్ధం చేసిన గెజిట్‌లో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడంతో, వాటిని సరిదిద్ది మళ్లీ సిద్ధం చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో 5 మండలాల్లో 35.140 కిలోమీటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో 4 మండలాల పరిధిలో 51.120 కిలోమీటర్ల మేర భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియలు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా ఐదు జిల్లాలకు సంబంధించిన గెజిట్ ప్రకటనలు పూర్తి చేస్తామని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Amaravati ORR
Amaravati Outer Ring Road
NHAI
Land Acquisition
Palnadu District
Guntur District
Krishna District
NTR District

More Telugu News