Hyderabad Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం.. ఓవర్‌డోస్‌తో యువకుడి మృతి

Hyderabad Drugs Mohammed Ahmed Dies of Overdose
  • అపార్ట్‌మెంట్‌లో నలుగురు స్నేహితులు కలిసి నివాసం
  • మృతుడి స్నేహితుల్లో ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ
  • లక్డీకాపూల్ నుంచి డ్రగ్స్ తెచ్చినట్లు గుర్తింపు
  • కో-లివింగ్ వ్యవహారంపై కూడా దృష్టి సారించిన పోలీసులు
హైదరాబాద్‌లో డ్రగ్స్ మరోసారి కలకలం రేపాయి. మాదకద్రవ్యాలు మోతాదుకు మించి తీసుకోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. మృతుడితో పాటు నివసిస్తున్న మరో ఇద్దరు స్నేహితులు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారణ అయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహనూమకు చెందిన సెల్‌ఫోన్‌ మెకానిక్‌ మహ్మద్‌ అహ్మద్‌ (26), రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోని కెన్వర్త్‌ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ నంబర్‌-805లో నివాసం ఉంటున్నాడు. అతడితో పాటు అత్తాపూర్‌కు చెందిన సయ్యద్‌ బిన్‌ సలామ్‌ (23) నగరానికి చెందిన షేక్‌ జారా, కోల్‌కతాకు చెందిన మొమతా బిస్వాస్‌ కలిసి కో లివింగ్‌లో ఉంటున్నారు.

బుధవారం ఉదయం అహ్మద్‌ లక్డీకాపూల్‌ వెళ్లి ఓ చిన్న ప్యాకెట్‌లో డ్రగ్స్ కొనుగోలు చేసి తెచ్చాడు. అదే రోజు రాత్రి డ్రగ్స్ తీసుకుని నిద్రపోయాడు. అయితే, అర్ధరాత్రి సుమారు 1:30 గంటల సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్నేహితులు గమనించారు. అప్పటికే అతడు మృతి చెందాడు. డ్రగ్స్ ఓవర్‌డోస్‌ వల్లే అహ్మద్‌ మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అహ్మద్ స్నేహితులైన సయ్యద్‌ బిన్‌ సలామ్‌, ఓ యువతికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వారు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్‌ పోలీసులు.. ఒకే ఇంట్లో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఎందుకు కలిసి ఉంటున్నారు? అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Hyderabad Drugs
Mohammed Ahmed
Drugs Overdose
Rajendranagar Police
Sayed Bin Salam
Cell phone mechanic
Lakdikapool
Telangana Drugs
Drug Abuse Hyderabad
Kenworth Apartment

More Telugu News