Pawan Kalyan: వందేమాతరం గేయానికి 150 ఏళ్లు.. ప్రతి ఒక్కరూ ఆలపించాలి: డిప్యూటీ సీఎం పవన్

Pawan Kalyan calls for Vande Mataram recitation on 150th anniversary
  • స్వాతంత్య్ర పోరాటంలో రణనినాదంగా నిలిచిందని కొనియాడిన పవన్
  • బంకిమ్ చంద్ర చటర్జీ రచించిన ఈ గేయం దేశానికి స్ఫూర్తినిచ్చిందని వెల్లడి
  • ఈరోజు ఉదయం 10 గంటలకు అందరూ ఆలపించాలని పిలుపు
  • కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గుర్తు చేసిన డిప్యూటీ సీఎం
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో యావత్ దేశాన్ని ఏకతాటిపై నడిపించిన ‘వందేమాతరం’ గేయం స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ చారిత్రక గేయం రచించి శుక్రవారంతో 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ దీనిని ఆలపించాలని ఆయన పిలుపునిచ్చారు.

బంకిమ్ చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయం, కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు స్వాతంత్య్ర పోరాటంలో ఒక రణనినాదంలా పనిచేసిందని పవన్ కొనియాడారు. సమరయోధులకు మనోబలాన్ని, దేశ ప్రజలకు ఉద్యమ స్ఫూర్తిని అందించిందని గుర్తుచేశారు. ఈ గేయం ప్రాముఖ్యతను, దాని ఘన చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకే సమయంలో ఈ గేయాన్ని ఆలపించాలని నిర్ణయించిందని ఆయన వివరించారు. "శుక్రవారం ఉదయం 10 గంటలకు మనమందరం వందేమాతరం గేయాన్ని ఆలపిద్దాం. మన స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని సజీవంగా నిలుపుకుందాం" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Pawan Kalyan
Vande Mataram
Vande Mataram song
Bankim Chandra Chatterjee
Indian Independence Movement
Deputy CM Pawan Kalyan
National Anthem
India
Narendra Modi

More Telugu News