Issac Dar: ఆ రోజు తాలిబన్లు ఇచ్చిన టీ మా కొంప ముంచింది: పాకిస్థాన్ ఉప ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

Issac Dar says Taliban tea ruined Pakistan
  • ఐఎస్ఐ మాజీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హమీద్ ఆఫ్ఘాన్ పర్యటనను ఉద్దేశించి వ్యాఖ్య
  • 2021లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత ఆ దేశంలో పర్యటించిన హమీద్
  • ఆ రోజు తాగిన కప్పు టీ ఎంతో నష్టాన్ని కలిగించిందన్న పాక్ ఉప ప్రధాని
తాలిబన్లు ఇచ్చిన ఒక కప్పు టీ తమ కొంప ముంచిందని పాకిస్థాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇస్సాక్‌దార్ అన్నారు. పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐఎస్ఐ మాజీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హమీద్ ఆఫ్ఘనిస్థాన్ పర్యటనను ఉద్దేశించి ఆయన విమర్శలు చేశారు.

2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చి అధికారం హస్తగతం చేసుకున్నారు. అదే ఏడాది హమీద్ ఆ దేశంలో పర్యటించారు. ఆ పర్యటనకు సంబంధించిన వీడియోలో ఒక సమావేశంలో ఆయన టీ తాగుతూ కనిపించారు. అంతా బాగుంటుందని తాలిబన్ పాలకులకు భరోసా ఇచ్చారు.

అయితే, ఆ కప్పు టీ తమకు ఎంతో నష్టాన్ని కలిగించిందని ఇస్సాక్‌దార్ తాజాగా విమర్శలు గుప్పించారు. ఆ టీ తర్వాత తాము మా సరిహద్దులను తెరిచామని, దీంతో 40 వేల మంది వరకు తాలిబన్లు చొరబడ్డారని, ఆ భేటీ తర్వాత పాకిస్థాన్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వం కరుడుగట్టిన నేరస్థులను కూడా విడుదల చేసిందని ఆరోపించారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో హామీద్ పర్యటన తర్వాత మిలిటెంట్లకు దారులు తెరుచుకున్నాయని, ఆ తర్వాత తమ దేశంలో ఉగ్రవాదాన్ని రగిల్చిందని మండిపడ్డారు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా తీసుకునే నిర్ణయాలపై నియంత్రణ కలిగి ఉండాలని సూచించారు.

ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పుడు నాడు పాకిస్థాన్‌లో అధికారంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం స్వాగతించింది. కానీ ఇప్పుడు రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ ఘర్షణ వాతావరణానికి ముగింపు పలికేందుకు చర్చలు జరుగుతున్నాయి.
Issac Dar
Pakistan
Taliban
Afghanistan
ISI
Fayaz Hameed
Pakistan Afghanistan relations
terrorism

More Telugu News