Patanjali: మిగతావన్నీ 'ధోకా' అని ఎలా అంటారు?.. పతంజలి యాడ్‌పై ఢిల్లీ హైకోర్టు సీరియస్

Delhi High Court Slams Patanjali Ad Over Dhoka Claim
  • పతంజలి చ్యవన్‌ప్రాశ్ ప్రకటనపై ఢిల్లీ హైకోర్టులో విచారణ
  • మిగతా బ్రాండ్లను 'ధోకా' అనడంపై న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం
  • పతంజలి యాడ్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన డాబర్ ఇండియా
  • తమది ఉత్తమమని చెప్పొచ్చు కానీ ఇతరులది మోసమనడం సరికాదని వ్యాఖ్య
  • ప్రకటనలో ఉన్నది అతిశయోక్తి మాత్రమేనని వాదించిన పతంజలి
ప్రముఖ యోగా గురు రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్ సంస్థకు ఢిల్లీ హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. తమ చ్యవన్‌ప్రాశ్‌ మాత్రమే అసలైనదని, మార్కెట్‌లోని ఇతర కంపెనీల ఉత్పత్తులన్నీ 'ధోకా' (మోసం) అని ప్రచారం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ డాబర్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

పతంజలి ప్రకటనపై డాబర్ ఇండియా మధ్యంతర ఉత్తర్వులు కోరగా, జస్టిస్ తేజస్ కరియా ఈ కేసును విచారించారు. "మీరు మీ ఉత్పత్తి ఉత్తమమైనదని చెప్పుకోవచ్చు. కానీ, ఇతరులందరినీ మోసగాళ్లు అని ఎలా అంటారు? 'ధోకా' అనేది చాలా ప్రతికూలమైన, అవమానకరమైన పదం. ప్రజలు మోసపూరితమైన పదార్థాన్ని తింటున్నారని మీరు చెప్పినట్లు అవుతుంది. నిఘంటువులో 'ధోకా' కాకుండా వాడటానికి మరో పదం లేదా?" అని పతంజలిని న్యాయమూర్తి సూటిగా ప్రశ్నించారు.

డాబర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సందీప్ సేథి... పతంజలి ప్రకటన అన్ని చ్యవన్‌ప్రాశ్ బ్రాండ్లను కించపరిచేలా ఉందని ఆరోపించారు. "ఒక యోగా గురు నుంచి ఇలాంటి మాటలు రావడం మరింత తీవ్రమైన విషయం. ఎందుకంటే ప్రజలు ఆయన మాటల్లో నిజాయితీ ఉంటుందని నమ్ముతారు. మాది 100 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థ. మార్కెట్‌లో 61 శాతం వాటా ఉంది. ఈ ప్రకటన కేవలం ఐదు రోజుల్లో 9 కోట్ల వ్యూస్ సంపాదించింది. ఇది ప్రజల్లో అనవసర ఆందోళన కలిగిస్తోంది" అని కోర్టుకు వివరించారు.

పతంజలి తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ నయ్యర్ వాదిస్తూ... తమ ప్రకటన కేవలం అతిశయోక్తి (Puffery and Hyperbole) మాత్రమేనని, చట్టప్రకారం ఇది అనుమతించదగినదేనని తెలిపారు. "మేము ఇతరుల ఉత్పత్తులు పనిచేయవని చెప్పడం లేదు. మాది అన్నింటికంటే ఉత్తమమైనదని చెప్పడమే మా ఉద్దేశం. డాబర్ ఈ విషయంలో అనవసరంగా అతిగా స్పందిస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.

తమ చ్యవన్‌ప్రాశ్‌లో "51 ఆయుర్వేద మూలికలు, కుంకుమపువ్వు" ఉన్నాయని పతంజలి తప్పుడు ప్రచారం చేస్తోందని, ఇది 2014 ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని కూడా డాబర్ తన పిటిషన్‌లో ఆరోపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
Patanjali
Ramdev
Dabur India
Chyawanprash
Delhi High Court
Ayurveda products
Advertising dispute
Healthcare
Indian market
Consumer protection

More Telugu News