POK Protests: పాకిస్థాన్ కు వ్యతిరేకంగా పీఓకేలో జెన్ జీ నిరసనలు.. విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత

POK Protests Against Pakistan Gen Z Students Agitation
  • పీఓకేలో మరోసారి మొదలైన ఆందోళనలు
  • ఈసారి విద్యార్థుల నేతృత్వంలో నిరసనలు
  • అధిక ఫీజులు, డిజిటల్ మార్కింగ్ విధానంపై ఆగ్రహం
  • నిరసనకారులపై కాల్పులతో హింసాత్మకంగా మారిన ఉద్యమం
  • షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. గత నెలలో పన్నులు, సబ్సిడీల కోసం జరిగిన హింసాత్మక ఆందోళనలు సద్దుమణగక ముందే.. ఇప్పుడు విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యా సంస్కరణలు, అధిక ఫీజులకు వ్యతిరేకంగా 'జెన్-జీ' యువతరం ప్రారంభించిన ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో స్థానికంగా తీవ్ర గందరగోళం నెలకొంది.

ముజఫరాబాద్‌లోని విశ్వవిద్యాలయాల్లో ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. సెమిస్టర్ ఫీజుల పేరుతో ప్రతి 3-4 నెలలకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని యూనివర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ అసెస్‌మెంట్ సిస్టమ్ (ఈ-మార్కింగ్) వల్లే అక్టోబర్ 30న విడుదలైన మొదటి సంవత్సరం ఫలితాల్లో తమకు ఊహించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చాయని వారు మండిపడుతున్నారు. కొందరైతే పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు కూడా పాస్ అయ్యారని ఆరోపించడం గమనార్హం.

శాంతియుతంగా జరుగుతున్న ఈ నిరసనలు ఇటీవల హింసాత్మకంగా మారాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఆగ్రహించిన విద్యార్థులు టైర్లకు నిప్పుపెట్టి, విధ్వంసానికి పాల్పడ్డారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ పరిణామాలు ఇటీవల నేపాల్, బంగ్లాదేశ్‌లలో జరిగిన విద్యార్థి ఉద్యమాలను గుర్తుచేస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆందోళనలతోనే షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. ఈ ఏడాది నేపాల్‌లోనూ విద్యార్థి ఉద్యమ తీవ్రతకు కేపీ ఓలీ సర్కారు రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పీఓకేలో యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది. ఇప్పటికే ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఆందోళనలు ఎలాంటి మలుపు తీసుకుంటాయోనన్న ఆసక్తి నెలకొంది.
POK Protests
Pakistan Occupied Kashmir
POK
Muzaffarabad
Student Protests
Shehbaz Sharif
Asim Munir
Pakistan Government
Kashmir unrest
Gen Z

More Telugu News