Vangalapudi Anita: మేం 'డ్రగ్స్ వద్దు బ్రో' అంటుంటే.. వైసీపీ 'కావాలి బ్రో' అంటోంది: హోంమంత్రి అనిత

Home Minister Anita releases photos of Jagan with Konda Reddy
  • డ్రగ్స్ కేసు నిందితుడు కొండారెడ్డితో జగన్ ఉన్న ఫొటోలు విడుదల
  • ఫొటోలను మీడియాకు రిలీజ్ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత
  • వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు
  • కొండారెడ్డిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని జగన్‌కు ప్రశ్న
  • రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ
  • తప్పు చేస్తే ఏ పార్టీ వారినైనా వదిలిపెట్టేది లేదని అనిత హెచ్చరిక
ఏపీలో డ్రగ్స్ వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇటీవల డ్రగ్స్ వాడుతూ పోలీసులకు పట్టుబడిన వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డితో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కలిసి ఉన్న ఫొటోలను హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

"కూటమి ప్రభుత్వం 'డ్రగ్స్ వద్దు బ్రో' అంటూ యువతను కాపాడే ప్రయత్నం చేస్తుంటే, వైసీపీ నేతలు మాత్రం 'డ్రగ్స్ కావాలి బ్రో' అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు" అని హోంమంత్రి అనిత మండిపడ్డారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఈ క్రమంలోనే 'ఈగల్' వ్యవస్థను పటిష్ఠం చేశామని తెలిపారు. ఈ బృందాల పనితీరు వల్లే విశాఖ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడని ఆమె వెల్లడించారు.

యూనివర్సిటీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కొండారెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని, యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. ఇంతటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కొండారెడ్డిని జగన్ ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. "ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? డ్రగ్స్ వాడే వారికి మీ పార్టీలో స్థానం కల్పిస్తారా?" అని ఆమె నిలదీశారు.

తప్పు ఎవరు చేసినా, ఏ పార్టీకి చెందినవారైనా ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. డ్రగ్స్ వంటి మహమ్మారిని అరికట్టడంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, రాజకీయాలకు అతీతంగా చర్యలు ఉంటాయని అన్నారు.
Vangalapudi Anita
Andhra Pradesh drugs
AP drugs issue
YS Jagan
Konda Reddy
YCP leaders
Visakha YCP
Eagle system
AP Home Minister
Drugs free AP

More Telugu News