Raveena Tandon: షారుఖ్ 'డర్' సినిమాను స్విమ్‌సూట్ వల్లే వదులుకున్నా: రవీనా టాండన్

Raveena Tandon Reveals Why She Rejected Shah Rukh Khans Darr Movie
  • షారుఖ్ ఖాన్ నటించిన 'డర్' సినిమాను తిరస్కరించినట్లు వెల్లడించిన రవీనా టాండన్
  • స్విమ్‌సూట్ ధరించాల్సి రావడంతోనే ఆ ఆఫర్ వద్దనుకున్నట్టు వివరణ  
  • ఈ చిత్రంలో హీరోయిన్‌గా తననే మొదట సంప్రదించారని వెల్లడి
బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ ఖాన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'డర్' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని నటి రవీనా టాండన్ బయటపెట్టారు. ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం మొదట తనకే వచ్చిందని, అయితే స్విమ్‌సూట్ ధరించడానికి ఇష్టపడక ఆ ప్రాజెక్ట్‌ను తిరస్కరించానని ఆమె తెలిపారు. సినిమా విడుదలై 32 ఏళ్లు గడిచిన తర్వాత ఈ విషయాన్ని ఆమె వెల్లడించడం గమనార్హం.

దిగ్గజ దర్శకుడు యశ్ చోప్రా దర్శకత్వంలో 1993లో వచ్చిన 'డర్' చిత్రంలో కథానాయిక పాత్ర కోసం చిత్రబృందం ముందుగా తననే సంప్రదించిందని రవీనా గుర్తుచేసుకున్నారు. "ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు నాకు అసౌకర్యంగా అనిపించాయి. ముఖ్యంగా ఓ సన్నివేశంలో స్విమ్‌సూట్ వేసుకోవాలని చెప్పారు. నాకంటూ కొన్ని నియమాలు ఉండటంతో కాస్ట్యూమ్స్ విషయంలో నేను రాజీపడలేకపోయాను. అందుకే ఆ సినిమా ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాను" అని రవీనా వివరించారు.

తాను వద్దనుకున్న తర్వాత ఆ అవకాశం జుహీ చావ్లాకు దక్కిందని రవీనా తెలిపారు. 'డర్' చిత్రంలో సన్నీ డియోల్ కథానాయకుడిగా నటించగా, షారుఖ్ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో అద్భుతంగా రాణించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడమే కాకుండా, షారుఖ్‌ పెర్ఫార్మెన్స్ కు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో నటనకు గానూ షారుఖ్ ఉత్తమ విలన్‌గా ఫిలింఫేర్ అవార్డును సైతం అందుకున్నారు. 
Raveena Tandon
Shah Rukh Khan
Darr Movie
Juhi Chawla
Yash Chopra
Bollywood
Swimsuit
Sunny Deol
Film career
Movie Offer

More Telugu News