Mukesh Kumar Meena: ఏపీలో అబ్కారీ శాఖలో అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు: ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా హెచ్చరిక

Mukesh Kumar Meena Warns Strict Action Against Corruption in AP Excise Department
  • ములకలచెరువు వంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశం
  • సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడి
  • ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి శాఖాపరమైన సమీక్షలు
  • పశ్చిమ గోదావరి సహా ఐదు జిల్లాల అధికారుల పనితీరుపై అసంతృప్తి
అబ్కారీ శాఖలో విధి నిర్వహణలో అలసత్వం వహించినా, అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా హెచ్చరించారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించవద్దని అధికారులకు స్పష్టం చేశారు. నిన్న మంగళగిరిలోని ఆబ్కారీ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి అధికారులతో ఆయన విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. ములకలచెరువు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నేరం జరిగినప్పుడు కనీస ప్రొటోకాల్ పాటించకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్కారీ శాఖలో వ్యవస్థీకృత అవినీతిపై పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, ఒక్క అధికారి అక్రమార్జనకు పాల్పడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కఠినంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు.

ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి అబ్కారీ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ సమీక్షలు నిర్వహిస్తారని, తాను స్వయంగా నెలకోసారి సమీక్షిస్తానని వెల్లడించారు. అధికారులు సాధారణ వివరణలు ఇవ్వడం మానేసి, స్పష్టమైన సమాధానాలతో రావాలని హితవు పలికారు. పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, అదే తరహాలో పనిచేస్తున్న మరో నాలుగు జిల్లాల అధికారులనూ మందలించారు.

అబ్కారీ శాఖ డైరెక్టర్ చామకూరి శ్రీధర్ మాట్లాడుతూ, కల్లు విక్రయాలు, ఉత్పత్తి సామర్థ్యంపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. రెండు రోజుల్లో పూర్తి డేటాతో జిల్లాస్థాయి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పర్మిట్ రూమ్ లైసెన్స్ ఫీజు బకాయిలను వెంటనే వసూలు చేయాలని సూచించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ, రాష్ట్రంలో అమ్మే ప్రతి మద్యం సీసాను ‘సురక్షా యాప్’లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. సుంకం చెల్లించని మద్యం, నాటుసారాపై అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఈ సమావేశంలో అదనపు కమిషనర్ దేవ కుమార్, సంయుక్త కమిషనర్లు అనుసూయ దేవి, నాగలక్ష్మి, అరుణ రావు, ఓఎస్డీ చంద్రశేఖర నాయుడు, వివిధ జిల్లాల అధికారులు పాల్గొన్నారు. 
Mukesh Kumar Meena
AP Excise Department
Andhra Pradesh
Chandrababu Naidu
Corruption
Liquor
Enforcement
Excise Commissioner

More Telugu News