Royal Challengers Bangalore: ఆర్సీబీని అమ్మేస్తున్నారు... ఐపీఎల్ లో కీలక పరిణామం

Royal Challengers Bangalore RCB to be Sold Key Development in IPL
  • అమ్మకానికి ఐపీఎల్ జట్టు ఆర్సీబీ
  • అధికారికంగా ప్రకటించిన ఆర్సీబీ యజమాని యునైటెడ్ స్పిరిట్స్
  • ప్రధాన వ్యాపారంపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం
  • 2026 మార్చి నాటికి అమ్మకం పూర్తి చేయాలని లక్ష్యం
  • కొనుగోలు రేసులో ప్రముఖులు
ఐపీఎల్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమ్మకానికి రానుంది. ఈ ఫ్రాంచైజీ యజమాని, ప్రముఖ ఆల్కహాల్ బేవరేజ్ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తమ ప్రధాన వ్యాపారంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది.

ఆర్సీబీ జట్టును నిర్వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌సీఎస్‌పీఎల్), యూఎస్ఎల్‌కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా ఉంది. ఈ పెట్టుబడిపై వ్యూహాత్మక సమీక్ష చేపడుతున్నట్లు యూఎస్ఎల్ తెలిపింది. దీని ప్రకారం, 2026 మార్చి 31 నాటికి ఈ అమ్మకం ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పురుషుల ఐపీఎల్ జట్టుతో పాటు, మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) జట్టుకు కూడా వర్తిస్తుంది.

ఈ పరిణామంపై యునైటెడ్ స్పిరిట్స్ ఎండీ, సీఈఓ ప్రవీణ్ సోమేశ్వర్ మాట్లాడుతూ, "యూఎస్ఎల్‌కు ఆర్‌సీఎస్‌పీఎల్ ఒక విలువైన ఆస్తి. అయితే, మా ప్రధాన వ్యాపారమైన ఆల్కహాల్ బేవరేజెస్ పరిశ్రమకు ఇది సంబంధం లేనిది. వాటాదారులందరికీ దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించేందుకు మా పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకుంటున్నాం. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆర్‌సీబీ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుంటాం" అని వివరించారు.

యూఎస్ఎల్ మాతృసంస్థ డయాజియో ఈ అమ్మకం ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. అమ్మకం ప్రక్రియకు ఒక నిర్దిష్ట గడువును ప్రకటించడం చూస్తుంటే, ఇప్పటికే కొనుగోలుదారులతో చర్చలు తుది దశకు చేరుకొని ఉండవచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. వీరిలో అదానీ గ్రూప్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన జిందాల్స్, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదార్ పూనావాలా, దేవయాని ఇంటర్నేషనల్ గ్రూప్ చైర్మన్ రవి జైపూరియాతో పాటు అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Royal Challengers Bangalore
RCB sale
IPL
United Spirits Ltd
Adani Group
Jindals
Adar Poonawalla
Ravi Jaipuria
WPL
Indian Premier League

More Telugu News