Virat Kohli: విరాట్ కోహ్లీ 37వ పుట్టినరోజు... శుభాకాంక్షల వెల్లువ

Virat Kohli Turns 37 Birthday Wishes Pour In
  • యువరాజ్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ తదితరులు శుభాకాంక్షలు
  • ఒకసారి రాజు అంటే ఎప్పటికీ రాజుగానే ఉంటాడంటూ యువరాజ్ ట్వీట్
  • రాబోయే తరాలకు స్ఫూర్తిస్తూనే ఉంటాడని యుజ్వేంద్ర చాహల్ ట్వీట్
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ బుధవారం 37వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతడికి అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 50 ఓవర్ల ఫార్మాట్‌పై దృష్టి పెట్టడానికి టెస్ట్‌లు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మినహా దాదాపు ప్రతి ఐసీసీ టోర్నమెంట్‌ను గెలుచుకున్నాడు. మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తదితరులు కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

"ఒకసారి రాజు, ఎల్లప్పుడూ రాజు. పుట్టినరోజు శుభాకాంక్షలు కోహ్లీ" అంటూ యువరాజ్ సింగ్ శుభాకాంక్షలు తెలియజేశాడు. రాబోయే సంవత్సరం మీకు మరింత గొప్పగా ఉండాలని కోరుకుంటున్నానని, ఆ దేవుడు ఆశీర్వదించాలని పేర్కొన్నాడు.

రాబోయే తరాలకు మీరు స్ఫూర్తినిస్తూనే ఉంటారని, ఆ దేవుడి ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని యుజ్వేంద్ర చాహల్ 'ఎక్స్' వేదికగా తెలియజేశాడు.

కింగ్ కోహ్లీకి 37 ఏళ్లు నిండాయని, భారత క్రికెట్‌లో లెజెండ్ అని సురేశ్ రైనా పేర్కొన్నాడు. కోహ్లీ మరిన్ని రికార్డులు, విజయాలు సాధించాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

ప్రపంచ క్రికెట్‌లో అతి పెద్ద ఛేజ్ మాస్టర్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు, నిజమైన భారతీయ హీరో అంటూ మహమ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు.

బౌలర్లకు దడ పుట్టించే చిరునామా, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. నిత్య నూతనంగా, స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నానంటూ కుల్దీప్ యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశాడు.

కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 254 నాటౌట్. ఈ ఫార్మాట్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన వారిలో కోహ్లీ నాలుగోవాడు.

వన్డే క్రికెట్ చరిత్రలో 8,000, 9,000, 10,000, 11,000, 12,000, 13,000, 14,000 పరుగుల మైలురాళ్లను అత్యంత వేగంగా చేరుకున్న ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. 

కోహ్లీ టీ20లలో టీమిండియా తరపున అత్యంత నిలకడగా రాణించిన బ్యాట్స్‌మెన్‌లో ఒకడు. 125 మ్యాచ్‌ల్లో 48.69 సగటుతో 4,188 పరుగులు, 117 ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, 38 అర్ధ సెంచరీలు సహా 137 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో అతను మూడో స్థానంలో ఉన్నాడు.
Virat Kohli
Virat Kohli Birthday
Indian Cricket
Yuvraj Singh
Yuzvendra Chahal
Suresh Raina
Mohammad Kaif

More Telugu News