OpenAI: భారత్‌లో ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ సందడి.. మొదలైన ఉద్యోగ నియామకాలు!

OpenAI ChatGPT Buzz in India Job Appointments Begin
  • బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాల ప్రారంభం
  • సొల్యూషన్ ఇంజనీర్ల పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం
  • అమెరికా తర్వాత భారతే తమకు అతిపెద్ద మార్కెట్ అన్న ఓపెన్ ఏఐ 
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఏఐ చాట్‌బాట్ ‘చాట్‌జీపీటీ’ మాతృసంస్థ ఓపెన్ఏఐ, ఇప్పుడు భారత మార్కెట్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. యూజర్ల సంఖ్య పరంగా అమెరికా తర్వాత అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా బెంగళూరు కేంద్రంగా ఉద్యోగ నియామకాలను ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధులు ధృవీకరించారు.

ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ సమావేశంలో ఓపెన్ఏఐ బిజినెస్ అప్లికేషన్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్, గ్లోబల్ అఫైర్స్ హెడ్ ప్రజ్ఞా మిశ్రా పాల్గొన్నారు. ఈ ఏడాది ఆగస్టులోనే భారత్‌లో తమ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశామని, తొలి ఏడాదిలో ఓ సమర్థవంతమైన చిన్న బృందాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని వారు తెలిపారు. ప్రస్తుతం సొల్యూషన్ ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేస్తున్నామని, బెంగళూరు వేదికగా డెవలపర్లతో సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నామని వివరించారు. స్థానిక స్టార్టప్‌లతో కలిసి పనిచేస్తున్నామని ప్రజ్ఞా మిశ్రా పేర్కొన్నారు.

ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కూడా గతంలో మాట్లాడుతూ, తమ కంపెనీకి అమెరికా తర్వాత భారతే అతిపెద్ద మార్కెట్ అని స్పష్టం చేశారు. భారత యూజర్లను ఆకట్టుకునేందుకు ఇటీవలే 12 నెలల పాటు ‘చాట్‌జీపీటీ గో’ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. కేవలం సేవలే కాకుండా, దేశంలో భారీ పెట్టుబడులకు కూడా సంస్థ సిద్ధమవుతోంది.

భవిష్యత్ అవసరాల కోసం భారత్‌లో 1 గిగావాట్ సామర్థ్యంతో ఓ భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఓపెన్ఏఐ సన్నాహాలు చేస్తోంది. దీనికోసం స్థానిక భాగస్వాములతో చర్చలు జరుపుతోంది. ఈ విస్తరణ ప్రణాళికల్లో భాగంగానే ప్రస్తుతం నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. ఆసక్తిగల అభ్యర్థుల కోసం తమ అధికారిక కెరీర్స్ పేజీలో ఉద్యోగ వివరాలను అందుబాటులో ఉంచింది.
OpenAI
ChatGPT
Sam Altman
India
Bangalore
job openings
artificial intelligence
data center
Pradnya Mishra
Srinivas Narayanan

More Telugu News