Claudia Sheinbaum: మెక్సికో అధ్యక్షురాలికి నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. వీడియో వైరల్

Claudia Sheinbaum Mexico President Sexually Harassed in Public
  • ప్రజలతో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి
  • అసభ్యంగా తాకుతూ ముద్దు పెట్టుకోవడానికి విఫలయత్నం
  • భద్రతా వైఫల్యంపై వెల్లువెత్తుతున్న విమర్శలు 
మెక్సికోలో అత్యంత దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఏకంగా దేశాధ్యక్షురాలికే నడిరోడ్డుపై లైంగిక వేధింపులు ఎదురవడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దేశ ప్రథమ పౌరురాలి భద్రతకే గ్యారెంటీ లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌ మంగళవారం ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ప్రజలతో మమేకమై మాట్లాడుతున్న సమయంలో, ఓ వ్యక్తి వెనుక నుంచి ఆమె వద్దకు వచ్చాడు. అనూహ్యంగా ఆమెపై చేయి వేసి, ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు.

వెంటనే అప్రమత్తమైన అధ్యక్షురాలి భద్రతా సిబ్బంది అతడిని పక్కకు నెట్టేశారు. అయినప్పటికీ, ఆ వ్యక్తి మళ్లీ క్లాడియాను అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురై, అతని చేతిని విదిలించి పక్కకు నెట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశాధ్యక్షురాలికే భద్రత లేకపోతే, సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది ఘోరమైన భద్రతా వైఫల్యమని, అంత దగ్గరకు వచ్చే వరకు సిబ్బంది ఏం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై మెక్సికో అధ్యక్ష కార్యాలయం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, అతడు మద్యం మత్తులో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు స్థానిక అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.
Claudia Sheinbaum
Mexico President
Sexual Harassment
Mexico
Presidential Security
Viral Video
Public Event
Crime
Women's Safety
Mexico News

More Telugu News