Jagan Mohan Reddy: ఫొటోల కోసం బురద లేని పొలంలో మట్టి అంటకుండా జగన్ పర్యటించారు: బుద్దా వెంకన్న

Budda Venkanna Criticizes Jagans Cyclone Tour
  • జగన్‌ది రైతు పరామర్శ కాదని, దండయాత్ర అని విమర్శ
  • రైతులు ఓట్లు వేయలేదనే అక్కసుతోనే జగన్ పర్యటించారన్న వెంకన్న
  • వందల కార్లు, పెయిడ్ ఆర్టిస్టులతో పరామర్శకు వెళ్లారని ఎద్దేవా
వైసీపీ అధినేత జగన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జరిపిన పర్యటనపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అది రైతులను పరామర్శించేందుకు చేసిన యాత్ర కాదని, ఎన్నికల్లో ఓడించారన్న అక్కసుతో వారిపైకి చేసిన దండయాత్ర అని ఆయన ఘాటుగా విమర్శించారు. రైతులపై ప్రేమ ఉంటే కట్ట మీద పొలాలున్న ప్రాంతంలో పర్యటించాలని సవాల్ విసిరారు.

విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వందల కార్లు, బైక్‌లు, పెయిడ్ ఆర్టిస్టులతో మందీ మార్బలంతో పరామర్శకు వెళ్లిన ఏకైక నాయకుడు జగన్ అని ఎద్దేవా చేశారు. రైతుల వద్దకు పరామర్శకు వెళ్లి పూలు చల్లించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. జగన్ పర్యటన చూస్తే ఆనందంతో వెళ్లినట్లు ఉంది తప్ప, రైతుల బాధలు పంచుకోవడానికి వెళ్లినట్లు లేదని వ్యాఖ్యానించారు.

అసలు తుపాను సమయంలో జగన్ ఎక్కడున్నారని వెంకన్న నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, లోకేశ్ రాత్రింబవళ్లు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. చంద్రబాబు తుపాను హెచ్చరికల సమయం నుంచే యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని, నష్టాన్ని తగ్గించేందుకు కృషి చేశారని తెలిపారు.

వ్యవసాయం గురించి జగన్‌కు ఏం తెలుసని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. "నీ తాతది గ్రానైట్, నీ తండ్రిది ఫ్యాక్షన్, నీది దగా వ్యాపారం" అంటూ వ్యక్తిగత విమర్శలు చేశారు. కేవలం ఫొటోల కోసం బురద లేని పొలంలో మట్టి అంటకుండా జగన్ పర్యటించారని సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొలంలో అడుగుపెట్టని వ్యక్తి, ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.

చంద్రబాబు పడి లేచిన కెరటం వంటి వారని, అలాంటి నేతకు వార్నింగ్ ఇచ్చే అర్హత, స్థాయి జగన్‌కు ఉన్నాయా? అని మండిపడ్డారు. జగన్ విధ్వంసకర పాలన అందించారు కాబట్టే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా జగన్ ఇలాంటి దండయాత్రలు మానుకుని ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు. 
Jagan Mohan Reddy
Budda Venkanna
TDP
Cyclone
Andhra Pradesh floods
Chandrababu Naidu
YS Jagan tour
farmers issues
political criticism
YSRCP

More Telugu News