Singireddy Meen Reddy: హైదరాబాద్ లో విషాదం.. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ యువకుడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య

Singireddy Meen Reddy Commits Suicide After Drunk Driving Check in Hyderabad
  • మల్కాజ్‌గిరిలో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తి ఆత్మహత్య
  • కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన
  • పోలీసుల ప్రవర్తనతోనే మనస్తాపం చెందాడని కుటుంబ సభ్యుల ఆరోపణ
హైదరాబాద్ మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఓ వ్యక్తి, పోలీసులు వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే, దమ్మాయిగూడకు చెందిన సింగిరెడ్డి మీన్‌ రెడ్డి (32) అనే వ్యక్తిని మల్కాజ్‌గిరి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో అదుపులోకి తీసుకున్నారు. అతనికి నిర్వహించిన పరీక్షల్లో బ్రీత్ ఎనలైజర్ రీడింగ్ 120గా నమోదైంది. అయితే, పోలీసులు వ్యవహరించిన తీరుతో మీన్‌ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.

ఈ క్రమంలో, అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఎదుటకు చేరుకున్న మీన్‌ రెడ్డి, తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు, పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

ఈ ఘటనపై మీన్‌ రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ప్రవర్తన కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Singireddy Meen Reddy
Hyderabad
Malkajgiri
Drunk and Drive
Suicide
Telangana Police
Road Safety
Dammaiguda
Kushaiguda

More Telugu News