Sundar Pichai: అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లు.. గూగుల్ సంచలన ప్రకటన!

Sundar Pichai Announces Google AI Data Centers in Space
  • అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు గూగుల్ శ్రీకారం
  • 'ప్రాజెక్ట్ సన్‌క్యాచర్' పేరుతో కొత్త పరిశోధన కార్యక్రమం
  • సౌరశక్తితో పనిచేయనున్న టీపీయూ ఆధారిత శాటిలైట్లు
  • 2027 నాటికి రెండు ప్రయోగాత్మక ఉపగ్రహాల ప్రయోగం
  • ఏఐ భారీ విద్యుత్ అవసరాలకు ప్రత్యామ్నాయ మార్గం
  • భూమిపై వనరుల భారాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యం
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మరో భారీ ప్రయోగానికి తెరతీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోసం ఏకంగా అంతరిక్షంలోనే డేటా సెంటర్లను నిర్మించేందుకు పరిశోధనలు ప్రారంభించినట్లు సంచలన ప్రకటన చేసింది. 'ప్రాజెక్ట్ సన్‌క్యాచర్' పేరుతో ఈ 'మూన్‌షాట్' కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించింది. భవిష్యత్తులో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విస్తరించడంలో ఈ ప్రాజెక్ట్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనుందని కంపెనీ భావిస్తోంది.

ఈ ప్రాజెక్టులో భాగంగా, గూగుల్ తన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ (టీపీయూ)లను అంతరిక్షంలోకి పంపనుంది. సౌరశక్తితో పనిచేసే చిన్నపాటి ఉపగ్రహాల సమూహాన్ని ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఏఐ డేటా సెంటర్లను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉపగ్రహాలను ఒకదానికొకటి ఫ్రీ-స్పేస్ ఆప్టికల్ లింక్స్ ద్వారా అనుసంధానిస్తారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్షంలో భారీ డేటా సెంటర్లు రానున్నాయని అంచనా వేసిన కొన్ని వారాలకే గూగుల్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.

ఈ సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. "మా టీపీయూలు అంతరిక్షంలోకి వెళ్తున్నాయి. క్వాంటం కంప్యూటింగ్, అటానమస్ డ్రైవింగ్ లాంటి మా మూన్‌షాట్ ప్రాజెక్టుల స్ఫూర్తితో 'ప్రాజెక్ట్ సన్‌క్యాచర్'ను ప్రారంభించాం. సౌరశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకుని అంతరిక్షంలో ఏఐ వ్యవస్థలను ఎలా నిర్మించవచ్చో అన్వేషిస్తున్నాం" అని తెలిపారు. 2027 ప్రారంభం నాటికి ప్లానెట్ సంస్థ భాగస్వామ్యంతో రెండు ప్రయోగాత్మక ఉపగ్రహాలను ప్రయోగించడమే తమ తదుపరి లక్ష్యమని ఆయన వివరించారు.

అంతరిక్షంలోనే ఎందుకు?

ఏఐ అల్గారిథమ్‌లకు అపారమైన విద్యుత్ శక్తి అవసరం. భూమిపై ఈ విద్యుత్ అవసరాలు పర్యావరణంపై భారం మోపుతున్నాయి. దీనికి పరిష్కారంగా గూగుల్ అంతరిక్షాన్ని ఎంచుకుంది. భూమి మీద కంటే అంతరిక్షంలోని సరైన కక్ష్యలో ఉండే సోలార్ ప్యానెల్ 8 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తుంది. దాదాపు నిరంతరాయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. బ్యాటరీల అవసరం కూడా తగ్గుతుంది. భూమిపై వనరుల వినియోగాన్ని తగ్గించి, ఏఐ పూర్తి సామర్థ్యాన్ని వాడుకోవాలంటే అంతరిక్షమే సరైన ప్రదేశమని గూగుల్ తన ప్రకటనలో పేర్కొంది.

అయితే, ఈ ప్రాజెక్టులో రేడియేషన్, థర్మల్ మేనేజ్‌మెంట్, సిస్టమ్ విశ్వసనీయత వంటి అనేక సాంకేతిక సవాళ్లు ఉన్నాయి. ఇప్పటికే తమ ట్రిలియం-జనరేషన్ టీపీయూలు భూమికి సమీప కక్ష్యలోని రేడియేషన్‌ను తట్టుకోగలవని ప్రయోగాల్లో తేలినట్లు గూగుల్ తెలిపింది. ఈ సవాళ్లను అధిగమించి, భవిష్యత్తులో అంతరిక్ష ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను నిర్మించే దిశగా గూగుల్ తన పరిశోధనలను ముమ్మరం చేస్తోంది.
Sundar Pichai
Google
AI data centers
Project SunCatcher
artificial intelligence
space data centers
TPU
Tensor Processing Units
Planet Labs
space technology

More Telugu News