Chinmayi Sripada: తాళి వివాదం: భర్త రాహుల్‌కు మద్దతుగా చిన్మయి ఘాటు స్పందన

Chinmayi Sripada Responds to Mangalsutra Controversy Backing Husband Rahul
  • మంగళసూత్రంపై దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చేసిన వ్యాఖ్యలు
  • తాళి ధరించాలనే సంప్రదాయాన్ని తాను సమర్థించనన్న రాహుల్
  • ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మొదలైన విమర్శలు
  • భర్తను విమర్శించిన నెటిజన్‌కు గాయని చిన్మయి కౌంటర్
  • తాళి లైంగిక దాడులను ఆపలేదంటూ చిన్మయి ఘాటు స్పందన
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన భార్య, ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మంగళసూత్రం ధరించకపోవడంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఈ విమర్శలపై తాజాగా చిన్మయి ఘాటుగా స్పందించారు. భర్తకు మద్దతుగా నిలుస్తూ, సంప్రదాయాలను ప్రశ్నించిన వారికి గట్టి సమాధానం ఇచ్చారు.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నవంబర్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన, పెళ్లి తర్వాత మహిళలు తప్పనిసరిగా తాళి ధరించాలనే సంప్రదాయాన్ని తాను సమర్థించనని స్పష్టం చేశారు. తన భార్య చిన్మయిని ఎప్పుడూ మంగళసూత్రం వేసుకోమని బలవంతం చేయలేదని ఆయన అన్నారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కొందరు రాహుల్‌ను సమర్థిస్తే, మరికొందరు తీవ్రంగా విమర్శించారు. ఓ నెటిజన్ అయితే, ఈ వ్యాఖ్యల వల్ల రాహుల్‌పై గౌరవం పోయిందంటూ పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో, తన భర్తపై వస్తున్న విమర్శలపై చిన్మయి ఎక్స్ ద్వారా స్పందించారు.

"మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులను, వేధింపులను ఆపలేదు. పుట్టుక నుంచి మరణించే వరకు ఈ సమాజంలో మహిళలకు ఏ దశలోనూ భద్రత లేదు. చాలాచోట్ల మృతదేహాలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అప్పుడే పుట్టిన పసికందులపై దారుణాలు ఆగడం లేదు కదా?" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ, సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ అనే అంశంపై కొత్త చర్చకు తెరలేపాయి. 
Chinmayi Sripada
Rahul Ravindran
Mangalsutra
The Girlfriend Movie
Chinmayi Rahul controversy
Social media criticism
Tradition vs freedom
Feminism
Women safety
Sexual assault

More Telugu News