Shashi Tharoor: శశిథరూర్ నిప్పుతో చెలగాటమాడుతున్నారు.. నాకేం జరిగిందో గుర్తు లేదా?: గాంధీ కుటుంబంపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

Shashi Tharoor Playing with Fire Says BJP Leader
  • దశాబ్దాలుగా ఒకే కుటుంబం రాజకీయాలను శాసిస్తోందని శశిథరూర్ విమర్శలు
  • 2017లో రాహుల్ గాంధీని నేను ప్రశ్నించినప్పుడు ఏం జరిగిందో గుర్తుకు లేదా అన్న పూనావాలా
  • ఆ కుటుంబం ప్రతీకారంతో వ్యవహరిస్తుంది.. మీకోసం ప్రార్థిస్తున్నానన్న షెహజాద్ పూనావాలా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ నిప్పుతో చెలగాటమాడుతున్నారు... ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నాకు ఏం జరిగిందో ఆయనకు గుర్తులేదా? అని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా అన్నారు. వారసత్వ రాజకీయాలపై శశిథరూర్ ఒక మీడియా కథనంలో తీవ్ర విమర్శలు చేశారు.

దశాబ్దాలుగా ఒకే కుటుంబం రాజకీయాలను శాసిస్తోందని, నెహ్రూ-గాంధీ వంశ ప్రభావం స్వాతంత్ర్య పోరాటంతో ముడిపడి ఉందని, దీంతో రాజకీయ నాయకత్వమనేది పుట్టుకతో వచ్చే హక్కు అనే ఆలోచనను స్థిరపరిచిందని ఆ కథనంలో పేర్కొన్నారు. ప్రతి పార్టీ, ప్రాంతం, స్థాయిలోనూ ఇది చొచ్చుకుపోయిందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు వారసత్వ రాజకీయ నాయకుల పేర్లను ఉదహరించారు.

ఈ కథనంపై బీజేపీ నేత 'ఎక్స్' వేదికగా స్పందించారు. శశిథరూర్ నిప్పుతో చెలగాటమాడుతున్నారని, ఆయన నేరుగా రాజకీయ వారసుల గురించి ప్రస్తావించారని పేర్కొన్నారు. 2017లో వారసత్వం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ గాంధీని నేను ప్రశ్నించినప్పుడు నాకు ఏం జరిగిందో మీకు గుర్తు లేదా సర్? అని రాసుకొచ్చారు. ఆయన కోసం ప్రార్థిస్తున్నానని, ఆ కుటుంబం ప్రతీకారంతో వ్యవహరిస్తుందని శశిథరూర్‌ను ఉద్దేశించి షెహజాద్ పూనావాలా హెచ్చరించారు.

2017లో కాంగ్రెస్ పార్టీలో జరిగిన అంతర్గత ఎన్నికల ప్రక్రియను పూనావాలా ప్రశ్నించారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాలని ముందే నిర్ణయించుకున్నారని, హస్తం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది బూటకమని ఆరోజు పూనావాలా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఆ తర్వాత పూనావాలా బీజేపీలో చేరారు.
Shashi Tharoor
Shehzad Poonawalla
BJP
Congress
Gandhi family
Dynastic politics
Rahul Gandhi

More Telugu News