Vaishnavi Kidnap Case: చిన్నారి వైష్ణవి కిడ్నాప్, హత్య కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Vaishnavi Kidnap Murder Case AP High Court Key Orders
  • ఇద్దరు నిందితుల జీవిత ఖైదును సమర్థించిన ధర్మాసనం
  • మరో నిందితుడు పంది వెంకట్రావు నిర్దోషిగా విడుదల
  • నిందితులు మోర్ల శ్రీనివాసరావు, జగదీష్ అప్పీళ్ల కొట్టివేత
  • 2010లో సంచలనం సృష్టించిన చిన్నారి కిడ్నాప్, హత్య ఘటన
  • ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు వేసిన పిటిషన్లపై విచారణ
ఏపీలో సంచలనం సృష్టించిన విజయవాడ చిన్నారి వైష్ణవి కిడ్నాప్, హత్య కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇద్దరు నిందితులకు ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదును సమర్థిస్తూ, మరో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. ట్రయల్ కోర్టు శిక్షను రద్దు చేయాలని కోరుతూ నిందితులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

జస్టిస్ కె. సురేష్ రెడ్డి, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. నిందితులు మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీష్ దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది. వారికి విధించిన జీవిత ఖైదును ఖరారు చేసింది. ఇదే కేసులో మరో నిందితుడైన పంది వెంకట్రావును నిర్దోషిగా ప్రకటిస్తూ, అతనికి ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది.

2010 జనవరి 30న పారిశ్రామికవేత్త పలగాని ప్రభాకర్ రావు కుమార్తె వైష్ణవిని విజయవాడలో నిందితులు కిడ్నాప్ చేసి, ఆ తర్వాత దారుణంగా హత్య చేశారు. గుంటూరు ఆటోనగర్‌లోని శారద ఇండస్ట్రీస్‌లో ఉన్న విద్యుత్ కొలిమిలో మృతదేహాన్ని వేసి కాల్చి బూడిద చేశారు. ఈ దారుణ ఘటన తెలియగానే కుమార్తె మరణాన్ని తట్టుకోలేక తండ్రి ప్రభాకర్ రావు గుండెపోటుతో మరణించారు.

ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన విజయవాడ సెషన్స్ కోర్టు, 2018 జూన్ 14న ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ముగ్గురు నిందితులు హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తాజాగా ఈ తీర్పును వెలువరించింది. 
Vaishnavi Kidnap Case
Vaishnavi
AP High Court
Vijayawada
Kidnap Murder Case
Palagani Prabhakar Rao
Morla Srinivasa Rao
Yamparala Jagadish
Pandi Venkatrao

More Telugu News