Jabar Travels: ఏపీలో మరో రోడ్డు ప్రమాదం.. ఐషర్ వాహనాన్ని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు

AP Road Accident Private Bus Collides With Eicher Vehicle
  • శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
  • 44వ జాతీయ రహదారిపై బోల్తా పడిన జబ్బర్ ట్రావెల్స్ బస్సు
  • ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలు
  • ఐషర్ వాహనాన్ని ఢీకొనడంతో అదుపుతప్పిన బస్సు
  • బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా అర్ధరాత్రి ఘటన
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
శ్రీ సత్యసాయి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న జబ్బర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దామాజిపల్లి వద్దకు చేరుకున్నప్పుడు, ముందు వెళ్తున్న ఐషర్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. అధిక వేగంతో ఢీకొనడంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపైనే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
Jabar Travels
Andhra Pradesh road accident
Sri Sathya Sai district
Chennekothapalli
Damajipalli
National Highway 44
bus accident
private travels bus
road accident

More Telugu News