Tejashwi Yadav: ఈ నెల 18న సీఎంగా ప్రమాణం చేస్తా.. బీహార్ లో గెలుపుపై తేజస్వీ యాదవ్ ధీమా

Tejashwi Yadav Confident of Victory Swearing in as CM on 18th
  • రాష్ట్రంలో ఏర్పడనున్నది మహాఘఠ్ బంధన్ కూటమి ప్రభుత్వమే
  • ప్రమాణ స్వీకారం తర్వాత కులమత భేదాల్లేకుండా నేరస్తులపై కొరడా
  • ఈ నెల 26 నుంచి జనవరి 26 లోగా నేరస్తులంతా జైలులో ఉంటారని వ్యాఖ్య
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఆర్జేడీ సీనియర్ నేత తేజస్వీ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. విజయం తమనే వరిస్తుందని ఆయన చెప్పారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరుగుతుందని, 18వ తేదీన తాము ప్రమాణ స్వీకారం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మహాఘఠ్ బంధన్ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. కూటమి తరఫున తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో నేరాల కట్టడికి చర్యలు చేపడతామని వివరించారు. ఇందులో భాగంగా కులమత భేదాల్లేకుండా నేరస్తులందరినీ జైళ్లకు పంపిస్తానని తేజస్వీ యాదవ్ చెప్పారు.

ఈ నెల 26 నుంచి జనవరి 26 లోగా రాష్ట్రంలోని నేరస్తులు జైళ్లకు చేరతారని తెలిపారు. చట్టప్రకారం వారిపై సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. జన్ సురాజ్‌ పార్టీ మద్దతుదారుడు దులార్‌ చంద్‌ హత్య కేసులో జేడీయూ ఎమ్మెల్యే అభ్యర్థి, మొకామా మాజీ ఎమ్మెల్యే అనంత్‌ సింగ్‌ అరెస్టు నేపథ్యంలో తేజస్వి యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారం చేయడంపైనా తేజస్వీ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆదివారం బీహార్ లో మోదీ ఎన్నికల ప్రచారాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో నేరం జరగకుండా ఒక్కరోజు కూడా గడవటంలేదని, ఈ పరిస్థితిని ప్రధాని మోదీ గమనించాలని అన్నారు.

తేజస్వీ యాదవ్ వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ వ్యంగ్యంగా స్పందించారు. రాష్ట్ర ప్రజలు ఈసారి కూడా సీఎం నితీశ్ కుమార్ పైనే నమ్మకం ఉంచుతారని, ఆయనకే ఓటేస్తారని తేజస్వీ యాదవ్ కు తెలిసిందని అన్నారు. అందుకే, ఎన్నికలు ముగిసిన తర్వాత విహారయాత్ర పేరుతో తేజస్వీ విదేశాలకు వెళతారని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకోవడం సహా తేజస్వీ యాదవ్ ఇతర ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు తనకు తెలిసిందని ఎద్దేవా చేశారు.

కేంద్ర ప్రభుత్వానికి తేజ్‌ ప్రతాప్‌ విజ్ఞప్తి
ఎన్నికల వాతావరణం నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయని, తన ప్రాణాలకు ముప్పు ఉందని లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, జనశక్తి జనతా దళ్‌ (జేజేడీ) చీఫ్‌ తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు భద్రత పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల దుండగుల కాల్పుల్లో దులార్‌ చంద్‌ మరణించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Tejashwi Yadav
Bihar Elections
RJD
Mahagathbandhan
Nitish Kumar
Bihar Politics
Rajiv Pratap Rudy
Tej Pratap Yadav
Bihar Crime

More Telugu News