Harmanpreet Kaur: మహిళల ప్రపంచకప్ విజయం.. మమత, బీజేపీ మధ్య మాటల యుద్ధం!

Harmanpreet Kaurs World Cup Win Sparks Political Row Between Mamata and BJP
  • భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలుపు
  • జట్టును అభినందిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమత ట్వీట్
  • ఆమె ట్వీట్‌పై బీజేపీ వ్యంగ్యంగా స్పందన
  • "రాత్రి 8 కల్లా ఇంటికి చేరమన్నారు కదా?" అంటూ సెటైర్
  • గతంలో మహిళలపై మమత చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసిన బీజేపీ
  • క్రికెట్ విజయోత్సవ వేళ రాజుకున్న రాజకీయ వివాదం
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించి తొలిసారి ప్రపంచకప్ గెలిచిన వేళ, ఆ చారిత్రక విజయం రాజకీయ రంగు పులుముకుంది. జట్టును అభినందిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ట్వీట్‌కు బీజేపీ ఘాటుగా బదులిచ్చింది. గతంలో మహిళలు రాత్రిపూట బయట తిరగడంపై మమత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తుచేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. దీంతో గర్వకారణమైన విజయం, రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో గత రాత్రి జరిగిన ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన అద్భుత విజయం సాధించింది. ఈ చారిత్రక గెలుపుపై సోమవారం మమతా బెనర్జీ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "ప్రపంచకప్ ఫైనల్‌లో మన అమ్మాయిలు సాధించిన విజయానికి దేశమంతా గర్విస్తోంది. టోర్నమెంట్ ఆసాంతం వారు చూపిన పోరాటపటిమ, ప్రదర్శించిన ఆధిపత్యం ఎందరో యువతులకు స్ఫూర్తినిస్తుంది. మీరు ప్రపంచస్థాయి జట్టు అని నిరూపించుకున్నారు. మీరు మా హీరోలు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. మేము మీకు అండగా ఉంటాం" అని పేర్కొన్నారు.

అయితే, మమత ప్రశంసల ట్వీట్‌పై గంటల వ్యవధిలోనే బీజేపీ అధికారిక ఖాతా నుంచి కౌంటర్ పడింది. గత నెలలో దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జరిగిన అత్యాచార ఘటనపై మమత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బీజేపీ ఓ సెటైర్ వేసింది. ‘‘అయ్యో! వాళ్లు రాత్రి 12 గంటల వరకు ఆడారు... కానీ మీరు వాళ్లను రాత్రి 8 గంటలకే ఇంటికి వచ్చేయమన్నారుగా?’’ అని బీజేపీ పోస్ట్ చేసింది.

గత నెలలో ఓ మెడికల్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారంపై మమతా బెనర్జీ మాట్లాడుతూ "బాధితురాలు రాత్రి 12:30 గంటలకు బయట ఎందుకు ఉంది? ముఖ్యంగా ఆడపిల్లలు రాత్రిపూట బయటకు రాకూడదు. వాళ్లను వాళ్లు కూడా కాపాడుకోవాలి" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. బాధితురాలినే నిందించేలా ఉన్నాయంటూ ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 

తాజాగా బీజేపీ అదే అంశాన్ని లేవనెత్తి మమతను ఇరుకునపెట్టే ప్రయత్నం చేసింది. జాతీయ జట్టు చారిత్రక విజయాన్ని దేశమంతా వేడుకగా జరుపుకుంటుండగా, ఈ రాజకీయ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ రాజకీయ రగడకు దూరంగా భారత మహిళల జట్టు దశాబ్దాల కలను సాకారం చేసిన ఆనందంలో మునిగి తేలుతోంది.
Harmanpreet Kaur
Womens Cricket World Cup
India Women's Cricket Team
Mamata Banerjee
BJP
Political Controversy
DY Patil Stadium
South Africa
Womens Safety

More Telugu News