Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. 12 మంది మృతి

Road Accident in Ranga Reddy District Leaves 12 Dead
  • రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద ఘటన 
  • ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లోడు టిప్పర్
  • బస్సుపై కంకర పడటంతో పలువురు ప్రయాణికుల గల్లంతు
  • మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు
  • హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్
రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ, తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే, తాండూరు నుంచి హైదరాబాద్‌కు సుమారు 70 మంది ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును, ఎదురుగా వస్తున్న కంకర టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు టిప్పర్‌లోని కంకర మొత్తం బస్సుపై పడిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులు కంకర రాళ్ల కింద చిక్కుకుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో కంకరను తొలగించి, మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీస్తున్నారు.

ప్రమాదానికి గురైన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులే ఉన్నారు. ఆదివారం సెలవు కావడంతో తమ స్వస్థలాలకు వెళ్లి, తిరిగి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు వస్తుండగా ఈ విషాదం జరిగింది. మృతుల్లో హైదరాబాద్‌లోని పలు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
Road Accident
Ranga Reddy district
Telangana
RTC bus
Tipper lorry
Hyderabad
Chevella
Mirjaguda
Road Mishap
Traffic Jam

More Telugu News