Harmanpreet Kaur: ఇది ఆరంభం మాత్రమే.. ముగింపు కాదు: హర్మన్‌ప్రీత్ భావోద్వేగం

Harmanpreet Kaurs Bold Declaration After Indias Womens World Cup Triumph
  • చరిత్రాత్మక విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు
  • ఈ గెలుపు ఒక ఆరంభం మాత్రమే అన్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్
  • కప్ అందుకుని కన్నీళ్లు పెట్టుకున్న మిథాలీ, ఝులన్ గోస్వామి
  • సపోర్ట్ స్టాఫ్, బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపిన కెప్టెన్
అర్ధరాత్రి వేళ... హర్మన్‌ప్రీత్ కౌర్ ఆ క్యాచ్ అందుకున్న క్షణం... భారత మహిళల క్రికెట్‌లో ఒక సరికొత్త శకం ఆవిర్భవించింది. ఆ ఒక్క క్యాచ్‌తో దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది, ప్రపంచకప్ కల సాకారమైంది. చరిత్రాత్మక విజయం తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయింది. మైదానంలో చిరుతలా పరుగులు పెట్టింది. సహచరులతో కలిసి ఆనందాన్ని పంచుకుంది. కోచ్ అమోల్ ముజుందార్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంది. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా ఆయన్ను గట్టిగా హత్తుకుంది.

ఈ విజయం తర్వాత ఆమె ప్రవర్తించిన తీరు అందరినీ కదిలించింది. భారత మహిళల క్రికెట్ దిగ్గజాలైన మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామిలను పిలిచి కప్‌ను వారి చేతుల్లో పెట్టింది. ఆ క్షణంలో ఆ ఇద్దరు దిగ్గజాలు కన్నీటిపర్యంతమయ్యారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన... ఝులన్‌ను హత్తుకుని, "దీదీ, యహ్ ఆప్కే లియే థా" (అక్కా, ఇది నీకోసమే) అంటూ చెప్పిన మాటలు స్టేడియంలో ప్రతిధ్వనించాయి.

పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో మాట్లాడిన హర్మన్‌ప్రీత్, ఈ విజయం జట్టు భవిష్యత్తుకు ఎంత కీలకమో వివరించింది. "ఈ అడ్డంకిని బద్దలు కొట్టాలని మేం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే, ముగింపు కాదు. గెలుపును ఒక అలవాటుగా మార్చుకోవడమే మా తదుపరి లక్ష్యం. మరిన్ని పెద్ద టోర్నమెంట్లు రాబోతున్నాయి. మేం మరింత మెరుగవ్వాలనుకుంటున్నాం" అని ఆమె స్పష్టం చేసింది.

కెప్టెన్సీ అంటే ఇదే..
కెప్టెన్సీ అంటే ప్రణాళికలే కాదు, కొన్నిసార్లు మనసు చెప్పింది వినడం కూడా. 1983 ప్రపంచకప్ ఫైనల్‌లో కపిల్ దేవ్... వివియన్ రిచర్డ్స్ జోరుమీదున్నప్పుడు మదన్ లాల్‌కు మరో ఓవర్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం లాంటిదే, ఈ ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ చేసింది. ప్రత్యర్థి బ్యాటర్లు లారా, సునే క్రీజులో పాతుకుపోయిన సమయంలో ఆమె బంతిని షఫాలీ వర్మ చేతికిచ్చింది. "ఆ సమయంలో షఫాలీని చూశాక, ఇది మన రోజనిపించింది. నా మనసు చెప్పింది, తనకి కనీసం ఒక ఓవర్ ఇవ్వాలని. అదే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయింది. వాళ్లు ఒత్తిడికి గురయ్యారు. మేం దాన్ని సద్వినియోగం చేసుకున్నాం" అని హర్మన్‌ప్రీత్ వివరించింది.

తన వన్డే కెరీర్‌లో అంతకుముందు కేవలం 14 ఓవర్లు మాత్రమే వేసిన షఫాలీ, ఈ మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. "జట్టులోకి వచ్చినప్పుడే, అవసరమైతే రెండు, మూడు ఓవర్లు వేయాల్సి ఉంటుందని చెప్పాం. అందుకు ఆమె, 'మీరు బౌలింగ్ ఇస్తే పది ఓవర్లు వేస్తా' అని ధీమాగా చెప్పింది. ఆమె పాజిటివ్ దృక్పథానికి సెల్యూట్" అని కెప్టెన్ ప్రశంసించింది.

ఈ గెలుపు వెనుక కోచ్ అమోల్ ముజుందార్, సపోర్ట్ స్టాఫ్, బీసీసీఐ ప్రోత్సాహం ఎంతో ఉందని హర్మన్‌ప్రీత్ పేర్కొంది. మరోవైపు ఈ విజయంతో షఫాలీ వర్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్టాండ్స్‌లో ఉండగా ఈ ప్రదర్శన చేయడం తనకు మరింత ప్రత్యేకం అని ఆమె తెలిపింది. "దేవుడు నన్ను ఇక్కడికి ఏదో మంచి చేయడానికి పంపాడు, అది ఈ రోజు నెరవేరింది" అంటూ తన సంతోషాన్ని పంచుకుంది.
Harmanpreet Kaur
Indian Women's Cricket
Women's World Cup
Shafali Verma
Smriti Mandhana
Mithali Raj
Jhulan Goswami
Amol Muzumdar
Cricket Victory

More Telugu News