Prasanth Varma: ఏకపక్ష కథనాలపై దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆగ్రహం.. మీడియాకు కీలక విజ్ఞప్తి

Prasanth Varma Angered by One Sided Narratives Appeals to Media
  • ప్రైమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు, ప్రశాంత్ వర్మకు మధ్య వివాదం
  • కొన్ని మీడియా సంస్థలు పక్షపాతంతో వార్తలు ప్రసారం చేస్తున్నాయన్న ప్రశాంత్ వర్మ
  • తనపై ఆరోపణలన్నీ నిరాధారమైనవని స్పష్టీకరణ
'హను-మాన్' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ, తనపై వస్తున్న మీడియా కథనాలపై స్పందించారు. ప్రైమ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో తనకు ఉన్న వివాదంపై కొన్ని మీడియా సంస్థలు ఏకపక్షంగా, పక్షపాతంతో వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ తరహా బాధ్యతారహిత జర్నలిజాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు.

తనకు, ప్రైమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు మధ్య ఉన్న వివాదం ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ పరిశీలనలో ఉందని ప్రశాంత్ వర్మ తెలిపారు. ఈ దశలో అందరూ ఆయా సంఘాల తీర్పు కోసం ఎదురుచూడటమే సరైన పద్ధతని, మీడియా ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని చూడటం సరికాదని హితవు పలికారు.

విచారణ దశలో ఉన్నప్పుడు ఒప్పందాలు, ఈమెయిల్స్, ఆర్థిక వివరాలు వంటి అంతర్గత పత్రాలను బయటపెట్టడం విచారణను ప్రభావితం చేయడమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తనపై చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అసత్యమని, నిరాధారమైనవని, కేవలం ప్రతీకారంతో చేస్తున్నవని ఆయన కొట్టిపారేశారు.

ఈ నేపథ్యంలో, అన్ని మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా ఛానెళ్లు ఈ వివాదంపై ఊహాగానాలతో కూడిన ప్రచారాలు మానుకోవాలని కోరారు. ఫిల్మ్ ఛాంబర్ విచారణ తుది తీర్పు వెలువడే వరకు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Prasanth Varma
HanuMan movie
Prime Entertainment
Telugu Film Chamber
Telugu Film Directors Association
film industry dispute
media bias
press note
controversy
film director

More Telugu News