Jemimah Rodrigues: మహిళల వరల్డ్ కప్ ఫైనల్... క్రిక్కిరిసిపోయిన డీవై పాటిల్ స్టేడియం

DY Patil Stadium Jampacked for Womens World Cup Final Amidst Rain Delay
  • మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు అపూర్వ స్పందన
  • భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ కోసం నిండిపోయిన స్టేడియం
  • టికెట్లన్నీ అమ్ముడయ్యాయని అధికారికంగా ప్రకటించిన ఐసీసీ
  • వర్షం పడినా గంటల తరబడి ఓపికగా ఎదురుచూసిన అభిమానులు
  • ఆస్ట్రేలియాపై చారిత్రక సెమీస్ గెలుపుతో పెరిగిన ఆసక్తి
  • మహిళల క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం
మహిళల క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం నమోదైంది. భారత మహిళల జట్టు సొంతగడ్డపై ఆడుతున్న తొలి వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. వర్షం అడ్డంకిగా మారినా లెక్కచేయకుండా వేలాదిగా తరలిరావడంతో ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం క్రిక్కిరిసిపోయింది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఈ తుదిపోరుకు టికెట్లన్నీ అమ్ముడయ్యాయని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా ప్రకటించింది.

ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రాత్మక సెమీ ఫైనల్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించడం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఆ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ అజేయ శతకంతో (127*) జట్టును గెలిపించిన తీరు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి ఆమె నెలకొల్పిన 167 పరుగుల భాగస్వామ్యం అందరినీ కట్టిపడేసింది. ఈ విజయంతో ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో స్టేడియం ప్రధాన ద్వారం వద్ద 'సోల్డ్ అవుట్' అని బ్యానర్ ప్రదర్శించాల్సి వచ్చిందని ఐసీసీ తెలిపింది.

ఆదివారం జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం కారణంగా టాస్ రెండు గంటలు ఆలస్యమైంది. అయినా అభిమానులు ఏమాత్రం సహనం కోల్పోలేదు. వర్షంలో తడుస్తూనే ఓపికగా ఎదురుచూశారు. గ్రౌండ్ సిబ్బంది కవర్లు తీయడానికి మైదానంలోకి వచ్చిన ప్రతిసారీ చప్పట్లతో వారిని ఉత్సాహపరిచారు. ఇక వార్మప్ కోసం భారత జట్టు మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు స్టేడియం మొత్తం హోరెత్తింది. 18వ ఓవర్‌లో జెమీమా రోడ్రిగ్స్ బ్యాటింగ్‌కు వస్తున్నప్పుడు అభిమానుల కేరింతలు తారాస్థాయికి చేరాయి.

గతంలో భారత్-ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ఇదే స్టేడియంలో 34,651 మంది హాజరయ్యారు. ఇప్పుడు ఆ రికార్డు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ స్టేడియం మొత్తం సామర్థ్యం 45,000. ఇంతవరకు ప్రపంచ కప్ గెలవని రెండు జట్లు టైటిల్ కోసం తలపడటం, దానికి ఈ స్థాయిలో ప్రజాదరణ లభించడం మహిళల క్రికెట్‌కు గొప్ప శుభపరిణామమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ లో స్కోరు చూస్తే... 41 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లకు 236 పరుగులు చేసింది. క్రీజులో దీప్తి శర్మ (39 బ్యాటింగ్), అమన్ జోత్ (6 బ్యాటింగ్) ఆడుతున్నారు. ఈ టైటిల్ సమరంలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.


Jemimah Rodrigues
Womens World Cup Final
DY Patil Stadium
India vs South Africa
Harmanpreet Kaur
Womens Cricket
ICC
Cricket World Cup
Deepti Sharma
Amanjot Kaur

More Telugu News