Satya Nadella: మైక్రోసాఫ్ట్ లో కొత్త ఉద్యోగాలు... సత్య నాదెళ్ల కీలక ప్రకటన

Satya Nadella Announces New Jobs at Microsoft
  • గతేడాది భారీగా ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్
  • మళ్లీ నియామకాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న సంస్థ
  • ఈసారి పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పైనే ఫోకస్
  • తమ ఉద్యోగుల సంఖ్య పెంచుతామని ప్రకటించిన సీఈవో సత్య నాదెళ్ల
  • ఏఐతో తక్కువ మందితో ఎక్కువ పని సాధిస్తామని వెల్లడి
  • భారీ ఉద్యోగ కోతల తర్వాత కొత్త నియామకాల ప్రకటన
గతేడాది వేలాది ఉద్యోగాల కోతలు చేపట్టిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఇప్పుడు మళ్లీ నియామకాలకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి నియామక ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నైపుణ్యాలు ఉన్నవారికే పెద్దపీట వేయనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

ఇన్వెస్టర్ బ్రాడ్ గెర్స్ట్‌నర్‌తో జరిగిన బీజీ2 పాడ్‌కాస్ట్‌లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ విషయాలను వెల్లడించారు. భవిష్యత్తులో తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ నియామకాలు 'స్మార్టర్, మోర్ లెవరేజ్డ్' పద్ధతిలో ఉంటాయని, ఏఐ సాంకేతికతే దీనికి చోదకశక్తిగా నిలుస్తుందని తెలిపారు.

2025 జూన్ చివరి నాటికి మైక్రోసాఫ్ట్‌లో సుమారు 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. గతంలో దాదాపు 15,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినప్పటికీ, ఉద్యోగుల సంఖ్య దాదాపు స్థిరంగా ఉంది. దీనికి భిన్నంగా, ఏఐ బూమ్ రాకముందు 2022లో కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను 22 శాతం పెంచుకుంది.

మైక్రోసాఫ్ట్ తన దృష్టిని ఏఐ మౌలిక సదుపాయాలు, భాగస్వామ్యాలు, మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గిట్‌హబ్ కోపైలట్ వంటి టూల్స్‌పై పెట్టుబడులు పెట్టడం వల్లే నియామకాల వేగం తగ్గింది. ఇకపై భారీగా నియామకాలు చేపట్టే దశ ముగిసిందని, 'టార్గెటెడ్ స్కేలింగ్' దశ ప్రారంభమైందని నాదెళ్ల వివరించారు. ఏఐ సహాయంతో చిన్న బృందాలు కూడా అద్భుతమైన ఫలితాలు సాధించగలవని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉద్యోగులు చేసే ప్రతీ పనిలో ఏఐ వినియోగం తప్పనిసరి అని, ఇది ఒక 'అన్‌లెర్నింగ్, లెర్నింగ్' ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. డిమాండ్‌కు తగినట్లు నియామకాలు చేపట్టలేని పరిస్థితుల్లో, తమ కంపెనీ ఫైబర్ నెట్‌వర్క్ కార్యకలాపాలను నిర్వహించడానికి ఎగ్జిక్యూటివ్ ఏఐ ఏజెంట్లను ఎలా ఉపయోగించారో ఆయన ఉదాహరణగా చెప్పారు.

ఇదిలా ఉండగా, ఈ ఏడాది కూడా మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులలో 4 శాతం, అంటే సుమారు 9,000 మందిని తొలగించిందని పలు నివేదికలు వచ్చాయి. ఈ కోతలు ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ (ఎక్స్‌బాక్స్) విభాగంపై తీవ్ర ప్రభావం చూపాయి. వ్యూహాత్మక వృద్ధి రంగాలపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్‌బాక్స్ హెడ్ ఫిల్ స్పెన్సర్ తెలిపారు.
Satya Nadella
Microsoft
Microsoft jobs
AI skills
Artificial Intelligence
Layoffs
Hiring
BG2 Podcast
Microsoft 365 Copilot
GitHub Copilot

More Telugu News