Donald Trump: హెచ్-1బీ, ఈఏడీ, గ్రీన్ కార్డుదారులే లక్ష్యంగా అమెరికా కొత్త రూల్స్... భారతీయులపై తీవ్ర ప్రభావం

Donald Trumps New US Rules Target H 1B EAD Green Card Holders Impact on Indians
  • ఈఏడీ ఆటోమేటిక్ రెన్యువల్ ప్రక్రియకు ఆకస్మిక నిలిపివేత
  • హెచ్-1బీ వీసా వార్షిక ఫీజును లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ సర్కార్
  • అమెరికా పౌరసత్వం కోసం పౌరశాస్త్ర పరీక్ష మరింత కఠినతరం
  • ఈ కొత్త నిబంధనలతో భారతీయులపైనే అత్యధిక ప్రభావం
  • అమెరికన్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకే ఈ చర్యలని ప్రభుత్వ వాదన
  • ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలోని భారత వృత్తి నిపుణుల్లో తీవ్ర ఆందోళన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వలస విధానాలపై తన కఠిన వైఖరిని మరింత స్పష్టం చేస్తున్నారు. "అమెరికన్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ" పేరుతో ఆయన తీసుకుంటున్న వరుస నిర్ణయాలు అమెరికాలోని భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత రెండు నెలల్లో ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన మూడు కీలక మార్పులు భారతీయ సమాజంలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) ఆటోమేటిక్ రెన్యువల్‌ను రద్దు చేయడం, హెచ్-1బీ వీసా ఫీజును భారీగా పెంచడం, గ్రీన్ కార్డుదారులకు పౌరసత్వ పరీక్షను కఠినతరం చేయడం వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.

ఈఏడీ ఆటోమేటిక్ రెన్యువల్ రద్దు
ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) అక్టోబర్ 30 నుంచి ఈఏడీల ఆటోమేటిక్ రెన్యువల్ విధానాన్ని ఆకస్మికంగా నిలిపివేసింది. గతంలో ఈఏడీ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకుంటే, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు పాత పర్మిట్‌పైనే ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ కొత్త నిబంధన ప్రకారం ప్రతి రెన్యువల్‌కు మళ్లీ కొత్తగా క్షుణ్ణంగా పరిశీలన జరిపాకే అనుమతి ఇస్తారు.

సాధారణంగా ఈఏడీ రెన్యువల్ ప్రక్రియకు 7 నుంచి 10 నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్ రెన్యువల్ లేకపోవడంతో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)పై ఉన్న ఎఫ్-1 విద్యార్థులు వంటి వేలాది మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హెచ్-1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంపు
సెప్టెంబర్ 19న ట్రంప్ సర్కార్ హెచ్-1B వీసాలపై కొత్తగా వార్షిక ఫీజును విధిస్తూ ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే సంస్థలు ప్రతి ఉద్యోగికి ఏటా 1,00,000 డాలర్లు (సుమారు రూ. 88 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును ఉద్యోగి కాకుండా, ఉద్యోగం ఇచ్చే సంస్థే చెల్లించాలి. అయితే, సెప్టెంబర్ 21, 2025 నాటికి ఇప్పటికే అమెరికాలో ఉన్నవారికి, దేశంలోనే ఉండి వీసా స్టేటస్ మార్చుకునేవారికి (ఉదాహరణకు, ఎఫ్-1 నుంచి హెచ్-1బీ) ఈ నిబంధన వర్తించదని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీటీఎస్) స్పష్టం చేసింది. హెచ్-1బీ వీసాల్లో 70 శాతం పొందుతున్న భారతీయులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ఫీజుల పెంపుతో వాల్‌మార్ట్ వంటి దిగ్గజ సంస్థలు హెచ్-1బీ వీసా అవసరమైన అభ్యర్థుల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేశాయి.

 కఠినంగా మారిన పౌరసత్వ పరీక్ష
గ్రీన్ కార్డు హోల్డర్లు అమెరికా పౌరసత్వం పొందాలంటే ఎదుర్కోవాల్సిన పౌరశాస్త్ర పరీక్షను కూడా ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త విధానంలో, దరఖాస్తుదారులు 128 ప్రశ్నల నుంచి ఎంపిక చేసిన 20 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఇందులో కనీసం 12 ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తేనే ఉత్తీర్ణులవుతారు. గతంలో ఈ పరీక్షలో 10 ప్రశ్నలకు 6 సరైన సమాధానాలు చెబితే సరిపోయేది. దీంతో పాటు, దరఖాస్తుదారుల "నైతిక ప్రవర్తన"పై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తారని తెలుస్తోంది.

ఈ పరిణామాలు అమెరికాలోని భారతీయ సమాజంలో భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితిని, ఆందోళనను సృష్టిస్తున్నాయి. వలసలను నియంత్రించాలనే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు భారతీయ వృత్తి నిపుణులకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి.
Donald Trump
H-1B visa
EAD
Green card
USCIS
Immigration
Indian professionals
Citizenship test
United States
Immigration rules

More Telugu News