Indigo Airlines: డ్యూటీకి రాని కో పైలెట్.. గంటపాటు నిలిచిన ఇండిగో విమానం!

Indigo Flight Delayed as Co Pilot Misses Duty in Hyderabad
  • శంషాబాద్‌లో గంట ఆలస్యంగా బయల్దేరిన ఇండిగో విమానం
  • ప్రయాణికులు, సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం
  • జనసేన నేత వీడియోతో వెలుగులోకి ఘటన
  • ఉదయం 9.50కి వెళ్లాల్సిన ఫ్లైట్ 10.50కి టేకాఫ్
  • కో పైలెట్ లేక విమానం ఆగడం ఇదే తొలిసారి
శంషాబాద్ విమానాశ్రయంలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. కో పైలెట్ సమయానికి విధులకు హాజరుకాకపోవడంతో ప్రయాణికులతో సిద్ధంగా ఉన్న ఓ విమానం దాదాపు గంటపాటు ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయింది. శనివారం ఉదయం శంషాబాద్ నుంచి ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఈ సంఘటన జరిగింది.

ఇండిగో సంస్థకు చెందిన 6ఈ 6263 విమానం ఉదయం 9:50 గంటలకు ముంబైకి బయలుదేరాల్సి ఉంది. ఇందుకోసం ప్రయాణికులంతా 9:40 గంటలకే విమానంలోకి చేరుకున్నారు. ప్రధాన పైలెట్ కూడా విధులకు హాజరయ్యాడు. అయితే, కో పైలెట్ మాత్రం ఎంతసేపటికీ రాకపోవడంతో విమానం టేకాఫ్ కాలేదు.

విమానం ఆలస్యం కావడంతో అసహనానికి గురైన ప్రయాణికులు సిబ్బందిని ప్రశ్నించారు. కో పైలెట్ ఇంకా రాలేదని సిబ్బంది చెప్పడంతో ప్రయాణికులకు, వారికి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇదే విమానంలో ప్రయాణిస్తున్న జనసేన నేత అజయ్ కుమార్, ప్రయాణికుల ఇబ్బందులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది.

సుమారు గంట ఆలస్యంగా కో పైలెట్ రావడంతో, విమానం 10:50 గంటలకు ముంబైకి బయల్దేరి వెళ్లిందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. సాధారణంగా సాంకేతిక కారణాల వల్ల విమానాలు ఆలస్యమవుతుంటాయి. కానీ, కో పైలెట్ రానందువల్ల విమానం ఆగిపోవడం ఇదే మొదటిసారి అని ప్రయాణికులు చర్చించుకుంటున్నారు.
Indigo Airlines
Indigo
Mumbai Flight
Shamshabad Airport
Co-Pilot
Flight Delay
Janasena Ajay Kumar
Hyderabad Airport
6E 6263

More Telugu News