Allu Arjun: మా ఇంట వేడుకలు మొదలయ్యాయి: అల్లు అర్జున్

Allu Arjun Shares Joy Over Allu Sirish and Naynika Engagement
  • అల్లు వారింట పెళ్లి సందడి 
  • నయనికతో హీరో అల్లు శిరీష్ నిశ్చితార్థం 
  • నయనిక వేలికి ఉంగరం తొడిగిన శిరీష్
  • సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, యంగ్ హీరో అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆయన తన ప్రేయసి నయనికతో నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో శుక్రవారం ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభవార్తను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఈ సంతోషకరమైన సందర్భంలో అల్లు అర్జున్ తన తమ్ముడికి, కాబోయే మరదలికి శుభాకాంక్షలు తెలిపారు. "మా ఇంట్లో వేడుకలు మొదలయ్యాయి! మా కుటుంబంలోకి కొత్త సభ్యురాలు వచ్చారు. ఈ ఆనంద క్షణం కోసం మేం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాం. నా ప్రియమైన సోదరుడు అల్లు శిరీష్‌కు అభినందనలు. నయనికకు మా కుటుంబంలోకి సాదర స్వాగతం. మీ ఇద్దరి కొత్త ప్రయాణం ప్రేమ, సంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

కాగా, నూతన జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు కుటుంబ అభిమానులు, సినీ ప్రముఖులు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

గత కొంతకాలంగా శిరీష్, నయనిక ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వీరి నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి వివాహ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ శుభకార్యంతో అల్లు వారింట పెళ్లి సందడి నెలకొంది.
Allu Arjun
Allu Sirish
Naynika
Allu Aravind
Engagement
Wedding
Tollywood
Hyderabad
Family Function
Celebrations

More Telugu News