KTR: బీఆర్ఎస్ పార్టీలో చేరిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్

KTR Welcomes TDP Leader Srinivas Naidu into BRS
  • టీడీపీలో సుదీర్ఘకాలం పని చేసిన శ్రీనివాస్ నాయుడిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్న కేటీఆర్
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి
  • కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్‌లోకి చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు, పలువురు పార్టీ నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన శ్రీనివాస్ నాయుడును పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిందని, ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని అన్నారు.

ఎమ్మెల్యే, మంత్రి లేదా ముఖ్యమంత్రి పదవి ఏదైనా ప్రజలు పెట్టిన భిక్ష అని ఆయన అన్నారు. అలాంటి ప్రజలను 'మీరు ఓటు వేయకుంటే ఏమీ ఇవ్వం' అని బెదిరించడమేమిటని ప్రశ్నించారు. ఈ దేశంలో ఎన్టీఆర్, ఇందిరా గాంధీలను కూడా ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. అలాంటిది ప్రజలకు మూడడుగుల రేవంత్ రెడ్డి ఎంత అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తనకు తాను చక్రవర్తిగా భావిస్తున్నారని మండిపడ్డారు.

సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరిస్తే, అదే ప్రజలు జూబ్లీహిల్స్‌లో ఆయన తోక కట్ చేసే ఆలోచనలో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేసిన ఒక్క మంచి పని చెప్పాలని నిలదీశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని కానీ ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు.

ముఖ్యమంత్రి అంటే ప్రజల సొమ్ముకు ధర్మకర్త అని గుర్తించాలని అన్నారు. ముఖ్యమంత్రి గారూ, మనది ఐదేళ్ల తాత్కాలిక ఉద్యోగం మాత్రమే, ఆ తర్వాత ప్రజలకు ఇష్టం లేకుంటే మనల్ని చెత్తబుట్టలో పడేస్తారని హెచ్చరించారు. ఇటీవల జూబ్లీహిల్స్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత తన భర్త గుర్తుకు వచ్చి ఏడిస్తే, దానిని కూడా కాంగ్రెస్ రాజకీయం చేసిందని మండిపడ్డారు.
KTR
K Taraka Rama Rao
BRS party
Telangana TDP
Srinivas Naidu
Jubilee Hills by-election
Revanth Reddy

More Telugu News