Google Chrome: మీ ప్రైవసీకి ప్రమాదం.. గూగుల్ క్రోమ్ వాడేవాళ్లు తక్షణం చేయాల్సిన పని ఇది!

Google Chrome Users Urged to Update Immediately Due to Security Threat
  • గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హై-రిస్క్ హెచ్చరిక
  • డెస్క్‌టాప్ వెర్షన్‌లో తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నాయని వెల్లడి
  • హ్యాకర్లు సులభంగా డేటాను దొంగిలించే ప్రమాదం ఉందని వార్నింగ్
  • విండోస్, మ్యాక్, లైనక్స్ వినియోగదారులు వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచన
  • పాత వెర్షన్లు వాడుతున్న వారికి ముప్పు ఎక్కువగా ఉందని స్పష్టీక‌ర‌ణ‌
  • బ్రౌజర్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు మార్చుకోవాలని తెలిపిన ఏజెన్సీ
మీరు ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం గూగుల్ క్రోమ్ వాడుతున్నట్లయితే మీకో ముఖ్యమైన హెచ్చరిక. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), క్రోమ్ డెస్క్‌టాప్ వినియోగదారులకు ఓ హై-రిస్క్ హెచ్చరిక జారీ చేసింది. క్రోమ్ బ్రౌజర్ పాత వెర్షన్లలో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలను గుర్తించినట్లు, వీటి వల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారం, ప్రైవసీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిపింది.

సైబర్ నేరాలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఈ లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు యూజర్ల అనుమతి లేకుండా వారి కంప్యూటర్ల నుంచి కీలక డేటాను దొంగిలించే ముప్పు ఉందని CERT-In తన నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా విండోస్, మ్యాక్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో క్రోమ్ డెస్క్‌టాప్ బ్రౌజర్ వాడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ప్రమాదంలో ఉన్న వెర్షన్లు ఇవే..
CERT-In ప్రకారం, కొన్ని నిర్దిష్ట పాత వెర్షన్లు వాడుతున్న వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది.
* 142.0.7444.59 కంటే ముందున్న గూగుల్ క్రోమ్ లైనక్స్ వెర్షన్లు
* 142.0.7444.59/60 కంటే ముందున్న విండోస్ వెర్షన్లు
* 142.0.7444.60 కంటే ముందున్న మ్యాక్ వెర్షన్లు

ఈ వెర్షన్లను వాడే వినియోగదారులు తక్షణమే తమ బ్రౌజర్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని ఏజెన్సీ గట్టిగా సిఫార్సు చేస్తోంది.

బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయడం ఎలా?
మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
* ముందుగా మీ కంప్యూటర్‌లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి.
* కుడివైపు పైన కనిపించే మూడు చుక్కల (More) మెనూపై క్లిక్ చేయండి.
* ఆ తర్వాత 'Help' ఆప్షన్‌లోకి వెళ్లి, 'About Google Chrome'ను ఎంచుకోవాలి.
* ఈ పేజీ ఓపెన్ అవ్వగానే, బ్రౌజర్ ఆటోమేటిక్‌గా కొత్త అప్‌డేట్‌ల కోసం చెక్ చేస్తుంది.
* అప్‌డేట్ అందుబాటులో ఉంటే, డౌన్‌లోడ్ పూర్తయ్యాక 'Relaunch' బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. దీంతో మీ బ్రౌజర్ లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ అయి, సురక్షితంగా ఉంటుంది.


సైబర్ దాడుల నుంచి వ్యక్తిగత డేటాను కాపాడుకోవాలంటే బ్రౌజర్లు, ఇతర సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవడం చాలా అవసరమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
Google Chrome
Chrome browser
CERT-In
cyber security
data theft
browser update
privacy
security vulnerabilities
Indian Computer Emergency Response Team
latest version

More Telugu News