Air Pollution: భారత్‌లో దారుణంగా వాయు కాలుష్యం.. ఒక్క ఏడాదే 17 లక్షల మంది బలి!

India Air Pollution Kills 17 Million in a Year Lancet Report
  • ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ నివేదికలో వెల్లడైన సంచలన విషయాలు
  • 2010తో పోలిస్తే 38 శాతం పెరిగిన కాలుష్య మరణాలు
  • వాతావరణ సంక్షోభమే ఆరోగ్య సంక్షోభం అని హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌‌వో
  • ఢిల్లీలో 15 శాతం పెరిగిన శ్వాసకోశ సంబంధిత కేసులు
  • గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిన పీఎం 2.5 స్థాయిలు
భారత్‌లో వాయు కాలుష్యం పెను భూతంలా మారుతూ లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటోంది. ప్రభుత్వం ఎంతగా కాదన్నా దేశంలో ఇది అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా కొనసాగుతోందని మరోసారి రుజువైంది. 2022లో ఒక్క ఏడాదిలోనే విషపూరిత గాలి కారణంగా 17 లక్షల మందికి పైగా భారతీయులు మరణించారని తాజా అధ్యయనం తేల్చింది. 2010తో పోలిస్తే ఈ మరణాల సంఖ్య ఏకంగా 38 శాతం అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రఖ్యాత "లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్" నివేదిక ఈ చేదు నిజాలను వెలుగులోకి తెచ్చింది. 71 విద్యాసంస్థలు, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలకు చెందిన 128 మంది నిపుణులు ఈ నివేదికను రూపొందించారు. శిలాజ ఇంధనాలపై మితిమీరి ఆధారపడటం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో విఫలమవడం ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి తీవ్ర ప్రభావం చూపుతోందో ఇది స్పష్టం చేసింది.

ఈ నివేదికపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జెరెమీ ఫర్రార్ మాట్లాడుతూ, "వాతావరణ సంక్షోభం అంటే ఆరోగ్య సంక్షోభమే. పెరుగుతున్న ప్రతి డిగ్రీ ఉష్ణోగ్రత ప్రజల ప్రాణాలను, జీవనోపాధిని బలిగొంటోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రజలను చంపుతోంది. అయితే, వాతావరణ మార్పులపై సరైన చర్యలు తీసుకుంటే అదే మనకు గొప్ప ఆరోగ్య అవకాశం. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన ఆహారం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలు లక్షలాది మంది ప్రాణాలను కాపాడగలవు" అని వివరించారు.

నివేదిక ప్రకారం, 2001-2023 మధ్య కాలంలో భారత్ సుమారు 23.3 లక్షల హెక్టార్ల అటవీ భూమిని కోల్పోయింది. కేవలం 2023లోనే 1.43 లక్షల హెక్టార్ల అడవులు కనుమరుగయ్యాయి. గడిచిన పదేళ్లలో పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం 3.6 శాతం మేర తగ్గింది.

ఈ నివేదిక వెలువడిన సమయానికే దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీని కారణంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య 15 శాతం పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొంతులో మంట, అలసట, తలనొప్పి వంటి లక్షణాలు వారిని వేధిస్తున్నాయి.

అపోలో ఆసుపత్రికి చెందిన పల్మనాలజీ నిపుణుడు డాక్టర్ రాజేశ్ చావ్లా మాట్లాడుతూ "గాలిలోని ప్రమాదకర కాలుష్య కారకాలు క్యాన్సర్, గుండె పనితీరు మందగించడం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ నెలల్లో రోగుల సంఖ్య 15 శాతం పెరిగింది. వారు కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతోంది" అని తెలిపారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం గత వారంలో ఢిల్లీలో పీఎం 2.5 కణాల సాంద్రత క్యూబిక్ మీటర్‌కు 488 మైక్రోగ్రాములకు చేరింది. ఇది గత ఐదేళ్లలో అత్యధికం కావడం గమనార్హం.
Air Pollution
India Air Pollution
Delhi Air Quality
Lancet Countdown
Climate Change
Health Crisis
Environmental Crisis
Fossil Fuels
Air Quality Index

More Telugu News