APSRTC Employees: రిటైర్డ్ ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం గుడ్ న్యూస్

APSRTC Employees Good News for Retired APSRTC Employees
  • ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ సదుపాయం
  • యాజమాన్యం నుంచి అధికారికంగా నోటిఫికేషన్ జారీ
  • 2020 జనవరి 1 తర్వాత రిటైర్ అయిన వారికి వర్తింపు
  • వన్‌టైమ్ చెల్లింపుతో ఉద్యోగి దంపతులకు జీవితకాల వైద్య సేవలు
  • ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల హర్షం
ఏపీ ప్రజా రవాణా శాఖ (ఆర్టీసీ)లో పనిచేసి పదవీ విరమణ పొందిన, పొందనున్న ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త తెలిపింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) కింద వైద్య సేవలు పొందేందుకు వీలు కల్పిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నిర్ణయంతో 2020 జనవరి 1 తర్వాత రిటైర్ అయిన వేలాది మంది ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఊరట లభించినట్లయింది.

ఆర్టీసీ ఉద్యోగులు 2020 జనవరి 1న ప్రభుత్వంలో విలీనమైన విషయం తెలిసిందే. అయితే, అప్పటి నుంచి పదవీ విరమణ చేసిన వారికి ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఈహెచ్‌ఎస్ సౌకర్యం గానీ, గతంలోలా ఆర్టీసీ ఆసుపత్రుల్లో వైద్యం గానీ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు సుదీర్ఘకాలంగా చేస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో, ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 6న ఆదేశాలు జారీ చేయగా, తాజాగా ఆర్టీసీ యాజమాన్యం విధివిధానాలతో కూడిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఈ పథకంలో చేరాలనుకునే వారు ఒకేసారి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సూపరింటెండెంట్‌ కేడర్‌ వరకు ఉన్నవారు రూ.38,572, అసిస్టెంట్‌ మేనేజర్‌ నుంచి ఆపై స్థాయి అధికారులు రూ.51,429 చెల్లించాలి. ఈ రుసుము చెల్లింపు విధానం, అవసరమైన వివరాల అప్‌లోడ్‌పై ఆర్టీసీ ఐటీ విభాగం త్వరలో స్పష్టత ఇవ్వనుంది.

ఈ మొత్తం చెల్లించిన విశ్రాంత ఉద్యోగి, వారి జీవిత భాగస్వామికి జీవితాంతం ఆర్టీసీ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో ఉచిత వైద్యం, మందులు లభిస్తాయి. దీంతో పాటు ఈహెచ్‌ఎస్‌ రిఫరల్ ఆసుపత్రుల్లోనూ వైద్యం పొందే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందితే, ఆ ఖర్చులను రీయింబర్స్‌ చేస్తారు.

ఈ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. వేలాది మంది విశ్రాంత ఉద్యోగుల వైద్య కష్టాలు తీర్చినందుకు ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎన్‌ఎంయూఏ, ఈయూ, కార్మిక పరిషత్‌ సంఘాల నేతలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. 
APSRTC Employees
APSRTC
RTC Employees Health Scheme
EHS Scheme
Andhra Pradesh
Government Employees Health Scheme
Pensioners
Retired Employees
Health Benefits
APSRTC Hospitals

More Telugu News