Pawan Kalyan: తుపాను బాధితులందరికీ న్యాయం చేయాలి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు

Pawan Kalyan Justice for Cyclone Victims in Andhra Pradesh
  • కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు రూపొందించమని పవన్ ఆదేశాలు 
  • తీర ప్రాంత గ్రామాల రక్షణపై బృహత్ ప్రణాళిక చేబట్టాలని సూచన 
  • పిఠాపురం నియోజక వర్గంలో పరిస్థితిపై ఆరా
కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ సాంత్వన  కలిగించి, న్యాయం చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లా అధికారులను ఆదేశించారు. పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ప్రకటించిన సాయం నష్టపోయిన ప్రతి ఒక్కరికీ  అందేలా చూడాలని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగు నీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. సముద్రానికి ఆనుకుని ఉన్న మత్స్యకార గ్రామాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఆదేశించారు. 

కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఆర్ఓ, ఆర్డీవోలు, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, వ్యవసాయ, విద్యుత్ శాఖలతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుపాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో జరిగిన నష్టం వివరాలపై ఆరా తీశారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తుపాను అనంతరం తీసుకుంటున్న ఉపశమన చర్యలు, ఆస్తి, పంట నష్టం అంచనాలపై దిశా నిర్దేశం చేశారు.

తీర ప్రాంతం మొత్తం తాత్కాలిక రాళ్ల గోడ నిర్మాణానికి చర్యలు

ఉప్పాడ తీర ప్రాంతంలోని సుబ్బంపేట వద్ద సముద్ర కోత నుంచి రక్షణకు రాళ్లతో తాత్కాలిక రక్షణ గోడ ఏర్పాటు చేశామని, ఇది సముద్రపు కోతను నిలువరించగలిగిందన్నారు. మిగిలిన తీర ప్రాంత గ్రామాలకు కూడా ఈ రాళ్ల గోడ నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాశ్వత రక్షణ గోడ నిర్మాణం పూర్తయ్యే వరకు ఇది తీర ప్రాంత గ్రామాలకు రక్షణ కల్పిస్తుందని,  తీర ప్రాంత గ్రామాల రక్షణకి ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలన్నారు. 
Pawan Kalyan
AP Deputy CM
Cyclone Mandous
Kakinada District
Pithapuram Constituency
Andhra Pradesh Floods
Cyclone Relief
Fishermen Villages
Coastal Erosion
Damage Assessment

More Telugu News