AP Government: ఏపీలో భిక్షాటనపై పూర్తి నిషేధం.. అమల్లోకి కొత్త చట్టం.. ఆ రెండు పదాల తొలగింపు

AP Government Implements Complete Ban on Begging in Andhra Pradesh
  • కొత్త సవరణ చట్టానికి గవర్నర్ ఆమోదం
  • గెజిట్‌లో అధికారికంగా ఉత్తర్వుల జారీ
  • భిక్షాటన మాఫియాను అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యం
  • పాత చట్టంలోని అభ్యంతరకర పదాల తొలగింపు
  • నిరుపేదలకు పునరావాసం కల్పిస్తామన్న ప్రభుత్వం
ఏపీలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తీసుకొచ్చిన 'భిక్షాటన నివారణ (సవరణ) చట్టం- 2025'కు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఇది అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ నెల 27న ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో ప్రచురించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భిక్షాటన చేయడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు.

రాష్ట్రంలో భిక్షాటన ఒక వ్యవస్థీకృత మాఫియాగా మారిందని ప్రభుత్వం గుర్తించింది. కొందరు దీనిని అడ్డుపెట్టుకుని నిరుపేదలను దోపిడీ చేస్తున్నారని, ఈ పరిస్థితిని అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త చట్టం అమలు బాధ్యతను సంక్షేమ, పోలీసు శాఖలు సంయుక్తంగా పర్యవేక్షిస్తాయి. భిక్షాటన చేసే నిరుపేదలు, నిస్సహాయులకు పునరావాసం కల్పించి, వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

చట్టంలో కీలక పదాల మార్పు
ఇదే సమయంలో 1977 నాటి భిక్షాటన నిషేధ చట్టంలో ప్రభుత్వం ముఖ్యమైన సవరణలు చేసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సూచనల మేరకు, చట్టంలో ఉన్న 'లెప్పర్' (Leper), 'ల్యూనాటిక్‌' (Lunatic) వంటి అభ్యంతరకరమైన పదాలను తొలగించింది. ఈ పదాలు కుష్టు, మానసిక వ్యాధిగ్రస్థులను కించపరిచేలా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది.

ఈ సూచనను స్వీకరించిన ప్రభుత్వం, 'లెప్పర్' స్థానంలో 'కుష్టు వ్యాధి సోకిన వ్యక్తి' అని, 'ల్యూనాటిక్‌' స్థానంలో 'మానసిక వ్యాధిగ్రస్థుడు' అని మార్పులు చేసింది. శాసనసభ, మండలిలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఈ సవరణలకు గవర్నర్ కూడా ఆమోదం తెలపడంతో న్యాయ శాఖ కార్యదర్శి గొట్టాపు ప్రతిభా దేవి పేరుతో జీవో ఎంఎస్ నం.58 జారీ అయింది. ఈ మార్పుల ద్వారా చట్టంలో మరింత గౌరవప్రదమైన భాషను చేర్చినట్లయింది.
AP Government
Andhra Pradesh
Begging Ban
Bhikshatana Nivarana Act 2025
NHRC
Leprosy
Mental Illness
Gottapu Pratibha Devi

More Telugu News