Anchor Shyamala: యాంకర్ శ్యామలపై పోలీసు కేసు... ఎందుకంటే...!

Anchor Shyamala faces police case in Kaveri bus accident controversy
  • కర్నూలు బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ 27 మందిపై కేసు
  • వైసీపీ అధికారిక ఎక్స్ పేజీ నిర్వాహకులు కూడా నిందితుల జాబితాలో!
  • బెల్టు షాపులు, కల్తీ మద్యం వల్లే ప్రమాదం జరిగిందంటూ ప్రచారం
  • మద్యం మత్తులో బైక్ నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసుల నిర్ధారణ
  • ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కర్నూలు పోలీసులు
  • అక్టోబర్ 24న జరిగిన ఈ ప్రమాదంలో 19 మంది మృతి
కర్నూలు జిల్లాలో 19 మంది ప్రాణాలను బలిగొన్న వేమూరి కావేరి బస్సు దగ్ధం ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ ప్రమాదంపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతా నిర్వాహకులతో పాటు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల, సీవీ రెడ్డి, కందుకూరి గోపికృష్ణ వంటి వారి పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలోని బెల్టు షాపులు, కల్తీ మద్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందంటూ వైసీపీ ప్రచారం చేయడమే ఇందుకు కారణమైంది. ఈ ప్రచారంపై కర్నూలు మండలం బి. తాండ్రపాడుకు చెందిన పేరపోగు వెనుములయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా కర్నూలు తాలుకా అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అసలేం జరిగింది?

అక్టోబర్ 24వ తేదీ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 19 మంది సజీవ దహనం కాగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ప్రమాదానికి అసలు కారణాన్ని వెల్లడించారు.

మద్యం మత్తులో శివశంకర్ అనే వ్యక్తి నడిపిన బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడని దర్యాప్తులో తేలింది. అదే బైక్‌పై ఉన్న అతని స్నేహితుడు ఎర్రి స్వామి పోలీసులకు కీలక సమాచారం ఇచ్చాడు. తామిద్దరూ మద్యం సేవించామని, ప్రమాదం తర్వాత రోడ్డుపై పడి ఉన్న శివశంకర్ మృతదేహాన్ని పక్కకు తీసే ప్రయత్నంలో ఉండగా, రహదారిపై ఉన్న బైక్‌ను కావేరి బస్సు వేగంగా ఢీకొని ఈడ్చుకెళ్లిందని, దానివల్లే మంటలు చెలరేగాయని వివరించాడు. ఈ వాంగ్మూలానికి మద్దతుగా, శివశంకర్ పెట్రోల్ బంక్‌లో ఆయిల్ కొట్టించిన సీసీ ఫుటేజ్‌ను కూడా పోలీసులు విడుదల చేశారు.

పోలీసుల దర్యాప్తు వాస్తవాలు ఇలా ఉండగా, దీనిని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ కల్తీ మద్యానికి ముడిపెట్టి ప్రచారం చేశారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు తాజాగా యాంకర్ శ్యామల, తదితర వైసీపీ నేతలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Anchor Shyamala
Vemuri Kaveri bus accident
Kurnool district
Andhra Pradesh
Road accident
YSRCP
Fake news
Kalluru mandal
Police case
Bus fire accident

More Telugu News