Revanth Reddy: ఆ సంప్రదాయాన్ని బీఆర్ఎస్ తుంగలో తొక్కింది: జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డి ప్రచారం

Revanth Reddy Slams BRS for Disregarding Tradition in Jubilee Hills Campaign
  • కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా
  • చనిపోతే పోటీలో నిలబెట్టవద్దనే సంప్రదాయాన్ని బీఆర్ఎస్ తుంగలో తొక్కిందని విమర్శ
  • పీజేఆర్ చనిపోతే బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టిందని ఆగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వెంగళరావు నగర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎవరైనా మరణిస్తే వారి స్థానంలో పోటీ పెట్టకూడదనే సంప్రదాయాన్ని బీఆర్ఎస్ పార్టీ తుంగలో తొక్కిందని ఆరోపించారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. గతంలో పీజేఆర్ మరణించినప్పుడు బీఆర్ఎస్ దుర్మార్గంగా వారి అభ్యర్థిని నిలబెట్టిందని మండిపడ్డారు. నగరానికి గోదావరి నీళ్లు తెచ్చిన ఘనత పీజేఆర్‌దేనని కొనియాడారు. అలాంటి పీజేఆర్‌పై పోటీకి దింపిన బీఆర్ఎస్‌కు సానుభూతి ఓట్లు అడిగే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌లో కూడా సెంటిమెంట్‌ను నమ్ముకున్నారని ఆరోపించారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధమని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవదానం చేసి బీజేపీని గెలిపించిందని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వచ్చారా అని నిలదీశారు. ఓట్ల కోసం బీఆర్ఎస్ నాయకులు వస్తే వారికి వాతలు పెట్టాలని ఓటర్లకు సూచించారు. నవీన్‌ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని హామీ ఇచ్చారు.
Revanth Reddy
Jubilee Hills
Telangana
BRS Party
Congress
Naveen Yadav
Telangana Politics

More Telugu News