Jemimah Rodrigues: జెమీమా రోడ్రిగ్స్ మానసిక దృఢత్వంపై వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యలు

Jemimah Rodrigues Praised by VVS Laxman for Mental Fortitude
  • జెమీమా మానసిక స్థైర్యానికి లక్ష్మణ్ ఫిదా
  • ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ పోస్ట్!
  • ఇదే అసలైన పోరాటమన్న క్రికెట్ లెజెండ్
భారత మహిళల జట్టు యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌పై క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. మహిళల ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనను జయించి ఆమె చూపిన మానసిక స్థైర్యాన్ని కొనియాడాడు. ప్రతికూల పరిస్థితుల్లో బలంగా నిలబడటమే నిజమైన దూకుడు అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.

మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో జెమీమా 127 పరుగులతో అజేయంగా నిలిచి, మహిళల వన్డే చరిత్రలోనే భారత్‌కు అత్యధిక పరుగుల ఛేదనలో అపురూప విజయాన్ని అందించింది. ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత ఆమె మాట్లాడుతూ, టోర్నమెంట్ ప్రారంభంలో తాను తీవ్రమైన ఆందోళనకు గురయ్యానని, కొన్ని మ్యాచ్‌లకు ముందు ఒత్తిడి తట్టుకోలేక తన తల్లికి ఫోన్ చేసి ఏడ్చేదాన్నని భావోద్వేగంతో వెల్లడించింది.

ఈ క్రమంలో, జెమీమా ధైర్యాన్ని మెచ్చుకుంటూ లక్ష్మణ్ 'ఎక్స్' లో స్పందించాడు. "మానసిక దృఢత్వం, కసి, నిజమైన దూకుడు అంటే ఇదే. ప్రతికూల పరిస్థితుల్లో తలవంచకుండా నిలబడటం, స్వీయ విశ్వాసంతో ముందుకు సాగడం ముఖ్యం. సందేహాలు, ఆందోళన, ప్రతికూల ఆలోచనలు వస్తాయి. కానీ, ఛాంపియన్లు అంతర్గత పోరాటంలో గెలిచి, ఒత్తిడిని అధిగమించి జట్టు లక్ష్యం నెరవేరే వరకు పోరాడుతారు" అని పోస్ట్ చేశాడు.

మ్యాచ్ అనంతరం విలేకరులతో మాట్లాడిన జెమీమా, "నేను ఈ విషయంలో చాలా నిజాయతీగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే, నాలా ఎవరైనా బాధపడుతుంటే వారికి నా మాటలు ధైర్యాన్ని ఇవ్వొచ్చు. ఎవరూ తమ బలహీనతల గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. టోర్నీ ఆరంభంలో నేను తీవ్ర ఆందోళన అనుభవించాను. ఆ సమయంలో ఏమీ తోచేది కాదు. మా అమ్మ, నాన్న నాకు ఎంతగానో అండగా నిలిచారు" అని తెలిపింది.

కాగా, ఇదే టోర్నమెంట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌కు జెమీమాను తుది జట్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత బలంగా పుంజుకున్న ఆమె, న్యూజిలాండ్‌పై 76 నాటౌట్, ఆస్ట్రేలియాపై 127 నాటౌట్‌తో చెలరేగి జట్టును ఫైనల్‌కు చేర్చింది. 339 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మూడో వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఆదివారం జరగనున్న ఫైనల్‌లో భారత్, దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
Jemimah Rodrigues
VVS Laxman
Indian Women's Cricket
Women's World Cup
Cricket
Mental Strength
Sports
India vs Australia
Cricket News
Womens ODI

More Telugu News