Harmanpreet Kaur: మా విజ‌యానికి ప్ర‌ధాన‌ కార‌ణం అదే: కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్

Harmanpreet Kaur Credits Teamwork for Victory
  • మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రక విజయం
  • కెప్టెన్ హర్మన్ 89 ర‌న్స్‌తో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్
  • హెడ్ కోచ్ అమోల్ మజుందార్ ప్రోత్సాహమే జట్టు పుంజుకోవడానికి కారణమన్న హర్మన్
  • పట్టుదల, కఠోర శ్రమే త‌మ‌ విజయానికి కార‌ణ‌మ‌న్న‌ కెప్టెన్
మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఏడుసార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా జట్టుపై చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (127 నాటౌట్) అజేయ శతకంతో కదం తొక్కగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89) కీలక ఇన్నింగ్స్‌తో రాణించింది. వీరిద్దరి అద్భుత భాగస్వామ్యంతో 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, ఫైనల్‌కు అర్హత సాధించింది.

ఈ మ్యాచ్‌లో జెమీమా, హర్మన్‌ప్రీత్ మూడో వికెట్‌కు 167 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ గెలుపుతో 2017 ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.

విజయం అనంతరం జియోస్టార్‌తో మాట్లాడిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఈ విజయం వెనుక ఉన్న కఠోర శ్రమను, పట్టుదలను వివరించింది. "వన్డేల్లో 300కు పైగా పరుగులు చేయడం రాత్రికి రాత్రే సాధ్యం కాదు. దీని వెనుక మా నిరంతర శ్రమ, పట్టుదల ఉన్నాయి. కోచ్ అమోల్ మజుందార్ గారు మమ్మల్ని మెరుగుపరచడానికి రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండటం నాకు అనుభవంతో వచ్చింది. ఓటముల నుంచి నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను" అని తెలిపింది.

మ్యాచ్ వ్యూహం గురించి వివరిస్తూ.. "నేను క్రీజులోకి వచ్చినప్పుడు జెమీమా సుమారు 30 పరుగులతో ఉంది. మనం చివరి వరకు క్రీజులో ఉంటే లక్ష్యాన్ని ఛేదించగలమని ఆమె నాతో చెప్పింది. స్మృతి మంధాన త్వరగా ఔటైనా, మాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఓవర్‌కు 6-7 పరుగుల రన్‌రేట్ కొనసాగించాలనే మా ప్రణాళిక ఫలించింది" అని పేర్కొంది.

టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పుడు హెడ్ కోచ్ అమోల్ మజుందార్ జట్టులో ఎలా స్ఫూర్తి నింపారో కూడా హర్మన్‌ప్రీత్ గుర్తుచేసింది. "ఆ రోజు కోచ్ కొంచెం దూకుడుగా మాట్లాడారు. కానీ, మేమంతా దాన్ని సానుకూలంగా తీసుకున్నాం. ఆయన మాటలు మా మంచి కోసమేనని మాకు తెలుసు. ఆ తర్వాత జట్టు ఎలా ఆడిందో మీరే చూశారు. ప్రతీ ఒక్కరూ జట్టు కోసం ఆడాలనే తపనతో బరిలోకి దిగారు" అని హార్మ‌న్ చెప్పుకొచ్చింది.
Harmanpreet Kaur
India Women Cricket
Jemimah Rodrigues
Amol Muzumdar
Women's World Cup
Australia Women Cricket
Cricket
Indian Cricket Team
Womens Cricket
ICC Womens World Cup

More Telugu News